కార్పొరేషన్ వద్దు.. గ్రామాలే ముద్దు.. రోడ్డెక్కిన రైతులు, ఉపాధి హామీ కూలీలు

by Aamani |
కార్పొరేషన్ వద్దు.. గ్రామాలే ముద్దు.. రోడ్డెక్కిన రైతులు, ఉపాధి హామీ కూలీలు
X

దిశ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ కార్పొరేషన్ లో తమ గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామస్తులు గోపాలపూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. సోమవారం గోపాలపూర్, దుర్షెడ్ గ్రామాలతోపాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు గోపాలపుర్ చౌరస్తా వద్దకు ఫ్లకార్డులతో ర్యాలీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీలు ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా గోపాలపూర్ గ్రామానికి చెందిన రైతు మంద రాజమల్లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం నుంచి కరీంనగర్ కార్పొరేషన్ లో కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అప్పటి మంత్రి ఎం.సత్యనారాయణ రావును పలు గ్రామాలకు చెందిన ప్రజలు అందరు కలిసి వెళ్లి తమ గ్రామాలను విలీనం చేయవద్దని విన్నవించుకోగా అప్పటి మంత్రి వెంటనే స్పందించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నారని గుర్తు చేశారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లో కూడా విలీనం ప్రతిపాదనలు ముందుకు వచ్చాయని, అయితే అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు తమ సమస్యను విన్నవించుకోగా వెంటనే స్పందించి నగరపాలక సంస్థ లో గ్రామాలను విలీనం కాకుండా చూశారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విలీనం ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం మీద ఆధారపడి రైతు కుటుంబాలు, ఉపాధి హామీ కూలీలు జీవిస్తున్నారని తమ గ్రామాలు కార్పొరేషన్ లో విలీనం చేస్తే తమకు జీవనోపాధి కరువవుతుందన్నారు. ఈ సమస్య పై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని గ్రామాల విలీన ప్రక్రియ ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed