మునుగోడులో వాళ్లు నాకు హామీ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-09-11 09:15:52.0  )
మునుగోడులో వాళ్లు నాకు హామీ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడానికే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని, ఈ రెండూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక పోరు పేరుతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని, కాంగ్రెస్‌తో స్నేహపూర్వకంగా ఉండే పార్టీలు, యూపీఏ భాగస్వాములనే కలుస్తున్నారని, కూటమిని చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేసీఆర్‌పైన రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆశావహులతో తన నివాసంలో ఉదయం భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకూ కేసీఆర్ కలిసిన పార్టీలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్నవేనని, ఎన్డీఏ కూటమి పార్టీలతో సంప్రదింపులే జరపలేదని, దీని వెనక కేసీఆర్ ఉద్దేశం ఏంటో స్పష్టమవుతున్నదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నేత జగన్, ఒడిషాలో బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలోని శివసేన చీలిక వర్గం (బీజేపీకి అనుకూలంగా ఉన్న గ్రూపు) నేత ఏక్‌నాథ్ షిండే లాంటివారిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. యూపీఏ కూటమి నుంచి భాగస్వామ్య పార్టీలను దూరం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు నితీష్ కుమార్, శిబూ సోరేన్, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ తదితరులను మాత్రమే కలిసి యాంటీ బీజేపీ గురించి చర్చలు జరపడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.

మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు కేసీఆర్ తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ కూడా సహకారం అందిస్తున్నదని రేవంత్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. ప్రగతి భవన్‌లో చర్చలు జరపడానికి వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తన పార్టీని కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీలో విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో చిల్లర పంచాయతీలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఇరు పార్టీలూ పశ్చిమబెంగాల్ ఫార్ములా ప్రకారం పని చేస్తున్నాయన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ఛేదించడానికే రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతికి ఏఐసీసీ టికెట్ ఖరారు చేసినందున ముగ్గురు ఆశావహులైన కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేతలు స్వచ్ఛందంగా గెలిపించడానికి సహకారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తూ శత్రువును ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారని రేవంత్ గుర్తుచేశారు. టిక్కెట్ దక్కకపోయినా రెండు గంటలు ఎక్కువ పని చేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు హామీ ఇచ్చారని, ఆ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : టీ-కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి గుడ్‌న్యూస్

Advertisement

Next Story

Most Viewed