Mahesh Kumar: ఓడించినా బుద్ధి మారలే.. కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ లేఖ

by Ramesh N |
Mahesh Kumar: ఓడించినా బుద్ధి మారలే.. కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : నాటి పెత్తందారు బీఆర్ఎస్ సర్కార్‌తో విసిగిపోయిన ప్రజలు వారి పాలనకు చరమగీతం పాడినా (KCR) కేసీఆర్‌లో గానీ, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పూ రాలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పంథాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సర్కారుపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ మహేశ్‌గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు.’ అని లేఖలో పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత మాదే..

మీ అల్లుడు హరీశ్‌రావు పెట్రోల్ డబ్బాతో, అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ రాజకీయ ఉపాధి కల్పించుకున్నారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను పూర్తి చేయలేకపోయారు. నోటిఫికేషన్ ఇచ్చాక మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పదో తరగతి మొదలు గ్రూప్-1 పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమే.’ అని గుర్తుచేశారు. మీ పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని స్పష్టంచేశారు. మీ హయాంలో అవినీతిమయమైన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు నెలకొల్పామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, ఆయన అనుచరులకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షరాల సత్యం అని స్పష్టంచేశారు. ఇలా మీరు చేసిన దౌర్భాగ్యపు పనులన్నింటినీ ఒక్కొక్కటి చక్కదిద్దుటుంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మీరు మాపై మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా..? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

అవాకులు చవాకులు మానండి

అధికారంలో ఉన్న పదేళ్లు పలు మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన మీరు, ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫామ్ హౌస్‌కే ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేసీఆర్‌కు మహేశ్‌గౌడ్ సూచించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక కార్యక్రమాలను విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించరని, తరిమి కొడుతారని హెచ్చరించారు. తెలంగాణ తల్లి రూపురేఖలపై విమర్శలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనమని చురకలంటించారు. మూసీ సుందరీకరణపైనా అసత్య ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారనే వాస్తవాన్ని తెలుసుకోవాలని స్పష్టంచేశారు. ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికైనా అవాకులు చవాకులు చేయడం మాని ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed