HYDRA : హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలు: కమిషనర్ రంగనాథ్

by Prasad Jukanti |   ( Updated:2024-09-04 15:30:50.0  )
HYDRA : హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలు: కమిషనర్ రంగనాథ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా పేరుతో ఎవరైనా బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే అలాంటి వారిని జైలుకు పంపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు..ఎవరైనా హైడ్రా పేరుతో కానీ మా పేర్లతో కాని బెదిరింపులకు పాల్పడినా, డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసినా అలాంటి వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అమీన్ పూర్ లో హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న విప్లవ్ సిన్హా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రంగనాథ్ వెల్లడించారు.

రంగనాథ్ నాకు తెలుసంటూ బెదిరింపులు:

అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బిల్డర్ సంస్థ నిర్మాణం చేపట్టింది. ఈ బిల్డర్ కు తాను సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని ప్రచారం చేసుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి సదరు బిల్డర్ ను బెదిరించారు. అంతే కాకుండా నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు. తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని లేకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని వార్తా పత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి పిలిపించాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో తనకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపించారు. అమీన్ పూర్ ఏరియాలో ఎలాంటి విషయమైనా రంగనాథ్ తననే అడుగుతారని నాకు డబ్బు ఇవ్వకుంటే మీ నిర్మాణాలను కూల్చేయిస్తానని, పత్రికల్లో తప్పుగా రాయిస్తానని బెదిరించారు. దీంతో బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story