పెళ్లిలో చికెన్ పెట్టలేదని రచ్చ రచ్చ

by Sathputhe Rajesh |
పెళ్లిలో చికెన్ పెట్టలేదని రచ్చ రచ్చ
X

దిశ, నవాబుపేట : ఆనందోత్సాహాలతో జరగాల్సిన పెళ్లి తంతు ఓ చిన్న సంఘటనతో రణరంగంగా మారింది. వివాహానికి హాజరైన బంధువులు తమకు చికెన్ పెట్టలేదనే ఏకైక కారణంతో పెళ్లి వారితో గొడవకు దిగి వివాహ వేదికను రణరంగంగా మార్చారు. అప్పుడే ఆహుతుల ఆశీర్వాదాలతో అలరారిన పెళ్లి పందిరి గొడవ కారణంగా రక్తసిక్తమై రచ్చ రచ్చగా మారింది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం మండల పరిధిలోని లోకిరేవు గ్రామంలో చోటుచేసుకుంది.

లోకిరేవు గ్రామానికి చెందిన ఓ యువకుడికి శుక్రవారం హన్వాడ మండల కేంద్రానికి చెందిన యువతితో వరుడి ఇంటి వద్ద వివాహం జరిగింది. వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు అందరూ కూడా వధూవరులను ఆశీర్వదించి విందు భోజనాన్ని ఆరగించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వివాహ సమయంలో వధూవరులను ఆశీర్వదించి, అక్కడి నుంచి వెళ్లిన వధువు తరపు బంధువులు కొందరు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వచ్చి భోజనం చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తమకు చికెన్ వేయలేదని, చికెన్ కావాలని పట్టుబట్టారు.

ఈ విషయంలో వధువు తరపు బంధువులకు వరుడి తరుపు బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వధువు తరపు బంధువులు వరుడి తరపు బంధువులపై ఘర్షణకు దిగారు. తమ చేతుల్లోని భోజనం ప్లేట్లను విసిరివేసి, దొరికిన వారిపై దొరికినట్లుగాపిడిగుద్దులు కురిపించారు. కర్రలతో దాడులు చేశారు. ఈ సంఘటనలో శ్రీను, మహేష్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంలో గ్రామస్తులు కలుగజేసుకొని ఇరువర్గాల వారిని శాంతింప చేసి గొడవ సద్దుమణిగింపచేశారు. గాయపడిన వారిని నవాబుపేట ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించిన వరుడి తరపు బంధువులు వివాదానికి కారకులైన వధువు తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed