ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లు సిద్ధం చేస్తున్న రాష్ట్రపతి భవన్.. ఎందుకంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2025-01-10 15:47:28.0  )
ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లు సిద్ధం చేస్తున్న రాష్ట్రపతి భవన్.. ఎందుకంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత గణతంత్ర దినోవ్సవ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ సిద్ధమవుతోంది. రిపబ్లిక్ దేశంగా మారి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ సారి రాష్ట్రపతి భవన్‌లో జనవరి 26న నిర్వహించే 'ఎట్ హోమ్' వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాలను తయారు చేస్తున్నారు. సాధారణంగా ప్రతీ ఏడాది మూడు సింహాల గుర్తు కలిగిన తెల్లని కార్డుపై ముద్రించిన ఆహ్వానాలను అతిథులకు పంపేవారు. అయితే ఈ సారి 75 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేకంగా బాక్సులను డిజైన్ చేశారు. ఈ ప్రత్యేక బాక్సులను తయారు చేయాలని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అధికారులను ఆదేశించారు. దీంతో అహ్మదాబాద్, బెంగళూరుల్లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) సహకారాన్ని రాష్ట్రపతి భవన్ అధికారులు తీసుకొని ఈ ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు.

భారత దేశం యొక్క 5వేల ఏళ్ల నాగరికత, చరిత్రను తెలియజేసేలా ఈ బాక్సులనుడిజైన్ చేసినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులుతెలిపారు. ఈ బాక్సులన్నింటినీ దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారులు స్వయంగా తయారు చేస్తున్నారని, ఆయా బాక్సులపై తయారు చేసిన వారి జియో ట్యాగ్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బాక్సుల డిజైన్లను బెంగళూరులోని ఎన్ఐడీ క్యాంపస్‌లోనే సిద్ధం చేసినా.. వాటిని మాత్రం ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందిస్తున్నట్లు ఎన్ఐడీ డైరెక్టర్ అశోక్ మొండల్ పేర్కొన్నారు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింభించేలా ఈ డిజైన్లు ఉంటాయని, ఈ పనిని మాకు అప్పగించడం గర్వకారణంగా ఉందని మొండల్ తెలిపారు.

Advertisement

Next Story