సిద్ధమైన బరులు.. కాలుదువ్వుతోన్న కోళ్లు..!(వైరల్ ఫొటో)

by Jakkula Mamatha |
సిద్ధమైన బరులు.. కాలుదువ్వుతోన్న కోళ్లు..!(వైరల్ ఫొటో)
X

దిశ, అల్లవరం: సంప్రదాయం పేరిట జూదం క్రీడకు ఉవ్విళ్లూరుతున్నారు పందెం రాయుళ్లు. ఎక్కడెక్కడ కొబ్బరి తోటలు, ఖాళీ స్థలాల్లో చదును పనులు చకచకా చక్కబెట్టిన పందేల నిర్వాహకులు పోలీసుల ఆదేశాలు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలానే ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం హెచ్చరికలు షరా మామూలుగానే ఊదరగొడుతుండగా వాటితో మాకేం పని అన్నట్లుగా తమ పని తాము చేసుకుపోతున్నారు పందేల నిర్వాహకులు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ప్రతీ ఏటా ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరుల్లో పందాలు యథేచ్ఛగా జరుగుతుండగా ఈ ఏటా అదే పద్ధతిలో బరులను సిద్ధం చేశారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో అల్లవరం, అమలాపురం రూరల్‌ మండలాల పరిధిలో సుమారు 20 వరకు బరులు సిద్ధం చేసిన పందేల నిర్వాహకులు బరులలో సహ జూదాల నిర్వహణ కోసం(గుండాటలు) రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఇదే తరహాలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో కూడా పదుల సంఖ్యలో బరులు సిద్ధం చేయగా అక్కడ గుండాటలకోసం వసూళ్ల పర్వం సాగినట్లు తెలుస్తోంది.. ఇక కొత్తపేట నియోజకవర్గం లో కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లోని పలు చోట్ల బహిరంగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ఇచ్చట కోడిపందాలు జరుగును అంటూ ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బరుల వద్దే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు, వాటితోపాటు బిర్యానీలు, ఇతరాత్ర దుకాణాలు నిర్వహించుకునేందుకు రోజూవారీగా రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరికొన్ని బరుల వద్ద లైటింగ్‌, సౌండ్‌ సిస్టంతోపాటు చూసేందుకు వీలుగా బల్లలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేల ఏర్పాట్లు కోసం ప్రత్యేకంగా కూటమి పార్టీలకు చెందిన వారినే కమిటీలుగా నియమిస్తున్నారు. ఇక రామచంద్రపురం, మండపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లోనూ అక్కడక్కడా పందాల బరులు సిద్ధం అవుతున్నాయి.. అయితే ఈ ఏట అనూహ్యంగా కొంతమంది మా గ్రామాల్లో పందెలు వద్దంటూ చెబుతుండగా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామ సర్పంచ్‌ నేతృత్వంలో కొంతమంది పోలీసులకు ఆర్జీ సమర్పించడం గమనార్హం.

గట్టిగా హెచ్చరించిన కలెక్టర్‌, ఎస్పీ..

జిల్లాల పునర్విభజన తరువాత అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు రెండొవ ఎస్పీగా వచ్చిన సుధీర్‌కుమార్‌ రెడ్డి టైమ్‌లో ఒక్క బరిలోనూ కోడి కాలు దువ్వని పరిస్థితి కనిపించింది.. కోడితో కనిపిస్తే చాలు లోపలేయమని మౌఖిక ఆదేశాలు నిర్మొహమాటంగా జారీ కావడంతో పందెం రాయుళ్లు పందెం అంటేనే పలాయనం చిత్తగించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత గత ఏడాది యధాతధంగా జరిగిన పందేలు ఈ ఏడాది కూడా అలాగే జరుగుతాయని పందెం రాయుళ్లు చెప్పుకొస్తున్నారు. అయితే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాత్రం జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో ఓ పక్క కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న పలువురు ప్రజా ప్రతినిధులు ఇస్తున్న భరోసాతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 785 మందిపై బైండోవర్లు పెట్టామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా పెడతామని ఎస్పీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, ఎస్పీ కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతిల సారధ్యంలో సమావేశం నిర్వహించి కోడిపందేల నిర్వాహణపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story