కలిసి రాని పార్టీ పేరు మార్పు.. బీఆర్ఎస్ ఫ్లీనరీపై కొనసాగుతున్న సస్పెన్స్..!

by GSrikanth |
కలిసి రాని పార్టీ పేరు మార్పు.. బీఆర్ఎస్ ఫ్లీనరీపై కొనసాగుతున్న సస్పెన్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్లీనరీ నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పార్టీ ఫోకస్ అంతా ఎన్నికలపై పెట్టడంతోనేనా? లేకుంటే మరేమైనా కారణాలు ఉన్నాయా? అనేది పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లీనరీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కదలికలు లేవు. పార్టీ సభ్యత్వాలను సైతం చేపట్టకపోవడం చర్చకు దారితీసింది. గతేడాది కూడా ప్లీనరీ నిర్వహించకుండానే కేవలం తెలంగాణ భవన్ లోనే పార్టీ జెండాను ఎగురవేసి జనరల్ బాడీ సమావేశంతో ముగించారు. ఈసారి ఏం చేస్తారనేది పార్టీ అధినేతకే తెలియాలి.

ప్రతి ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహించడం ఆనవాయితీ. 2001 నుంచి ఏప్రిల్ 27న నిర్వహిస్తుంది. అయితే ఈసారి నిర్వహణపై పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. మరో 17 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ అధిష్టానం ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారం జరుగుతుండటం, మరోవైపు పార్టీ సైతం రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ప్లీనరీ నిర్వహించాలా? వద్దా? అనేది అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్లీనరీ నిర్వహిస్తే సమయం వృథా అవుతుందని భావిస్తుందా? అనేది కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కొందరు నిర్వహిస్తే బాగుంటుందని, నేతలకు, కేడర్ కు మార్గనిర్దేశం చేయడంతోపాటు జోష్ ను నింపవచ్చని భావిస్తున్నారు. పార్టీ మాత్రం ఫ్లీనరీపై ఎటు తేల్చుకోలేకపోతుందని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

గతేడాది పార్టీ జనరల్ బాడీతోనే ముగింపు...

గతేడాది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని భావించిన అధిష్టానం ప్లీనరీ నిర్వహించలేదు. కేవలం పార్టీ జెండాను ఆవిష్కరించి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సుమారు 7గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. అప్పుడు కేవలం అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టిసారించిన కేసీఆర్...ఈసారి లోక్ సభ ఎన్నికలు రావడంతో మళ్లీ జనరల్ బాడీ సమావేశంతోనే ముగిస్తారా? లేకుంటే పార్టీ జెండా ఎగురవేసి ముగిస్తారా? అనేది చూడాలి.

పార్టీ సభ్యత్వాల ఊసే లేదు..

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును 2021లో చేపట్టింది. సభ్యత్వ గడువు ముగుస్తున్నప్పటికీ తిరిగి సభ్యత్వ నమోదు చేపట్టలేదు. చేపట్టే కార్యచరణ సైతం పార్టీ నేతలకు అధిష్టానం చెప్పలేదు. గతంలో సభ్యత్వ నమోదు చేపట్టినప్పుడు 60లక్షల సభ్యత్వం ఉన్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని పదేపదే చెప్పింది. అయితే అప్పుడు అధికారంలో ఉండగా చేపట్టింది. ఈసారి అధికారం కోల్పోడంతో ఎన్ని సభ్యత్వాలు చేయనుంది...అసలు ఆ నమోదు కార్యక్రమం చేపడుతుందా? లేదా? అనేది కూడా పార్టీలోనే సస్పెన్స్ కొనసాగుతుంది.

డిసెంబర్ 9న పార్టీ పేరు మార్పు

2022 డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహిస్తారా? లేకుంటే పార్టీ పేరుమార్చిన డిసెంబర్ 9న పరిగణలోకి తీసుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలు మాత్రం ఏప్రిల్ 27నే ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొంటున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే పార్టీ ప్లీనరీ నిర్వహిస్తే పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై కేడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తే మాత్రం కేవలం కొంతమందికి మాత్రమే సమావేశానికి ఆహ్వానం ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాలు ఫైనల్ అవుతాయి. ప్లీనరీ అయితే బహిరంగంగా ప్రజలకు పార్టీ విధానాలు స్పష్టంగా వివరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం అధినేత కేసీఆర్ తీసుకోబోతున్నారు? అసలు ప్లీనరీ నిర్వహిస్తారా? లేదా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed