సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టిస్తోన్న జర్నలిస్టుల వరుస మరణాలు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-15 16:17:45.0  )
సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టిస్తోన్న జర్నలిస్టుల వరుస మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టుల వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే వివిధ పత్రికలకు చెందిన నలుగురు వర్కింగ్ జర్నలిస్టులు మృతి చెందడం పాత్రికేయులను కలవర పెడుతోంది. కేవలం ఈ జిల్లానే కాకుండా కరీంనగర్, వరంగల్ జిల్లాలోనూ రిపోర్టర్లు ప్రాణాలు వదిలారు. ఈ వరుస ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల్లో ఆందోళన నెలకొంది.

అవినీతిని అరికడదాం.. అక్రమాలను ప్రశ్నిద్దాం అని కలం పట్టిన యోధులు పట్టుమని నాలుగు పదుల వయసు దాటక ముందే కన్నుమూస్తున్నారు. రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాల నుంచే వచ్చినా నమ్ముకున్న జర్నలిజం కోసం కడుపు మాడ్చుకోని మరి పని చేశారు. రాత్రనకా, పగలనకా.. కడుపు మార్చుకోని వార్తల కోసం అహర్నిషలు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పట్టించుకోక ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు, హుజూర్ నగర్‌లో ఒకరు, ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన ఓ జర్నలిస్ట్ అనారోగ్యంతో మృతి చెందగా, కరీంనగర్, వరంగల్‌ ఇద్దరు జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వరంగల్‌లో కూతురుతో సహ జర్నలిస్ట్ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచివేసింది.

సూర్యాపేట జిల్లాలో పాత్రికేయుల మరణాలు వర్కింగ్ జర్నలిస్టుల దయానీయస్థితిని కళ్లకు కట్టింది. ఏళ్ల తరబడి పత్రికా సంస్థలకు వెట్టిచాకిరి చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. లైన్ అకౌంట్లకు పేరా అంతోకొంత ఇచ్చినా అది జర్నలిస్టుల పెట్రోలు ఖర్చులకు కూడా సరిపోలేని దుస్థితి. ఓ వైపు కుటుంబ పోషణ, మరోవైపు పిల్లల చదువుకు అప్పులు చేస్తున్న నేపథ్యంలో తను అనారోగ్యం పాలైనా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేని దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యాలు దెబ్బతిని నలుగురు జర్నలిస్టులు కన్నుమూశారు. అయినా వారికి పత్రికా యాజమాన్యాలు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని తోటి జర్నలిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాల దీనస్థితికి చలించిపోయిన జర్నలిస్టులే తలా కొంత డబ్బు జమ చేసి వారి పిల్లల పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి అండగా నిలిచారు.

ఉదయం లేచినకానుంచి.. రాత్రి వరకు రిపోర్టర్లకు సలాం కొడుతూ వార్తలు రాయించుకునే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పరామర్శలకే పరిమితం అయ్యారే కానీ పట్టుమని పది రూపాయలు ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం తోటి జర్నలిస్టులు, మిత్రులే సాయం అందించి వారి కుటుంబాలకు కొంత ఆసరాగా నిలిచారే తప్పా ఎవరు ముందుకు రాలేదు. సూర్యాపేట, హుజూర్ నగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం చేయూతనివ్వకపోవడం విచారం కలిగించే అంశం. హుజూర్ నగర్‌లో రెండు నెలల క్రితం జర్నలిస్టు సంఘం నాయకుడు, సీనియర్ రిపోర్టర్ ఎలుక సైదులు గౌడ్ మరణించినా పాలకులు, యాజమాన్యం పట్టించుకోలేదు. సైదులు జిల్లాలో పేరెన్నికగల జర్నలిస్ట్. ఆయన పాలకుల అవినీతి అక్రమాలపై, అధికారుల లంచగొండితనంపై పోరాటాలు సైతం చేశారు. ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసులు నమోదు కావడంతోపాటు అధికారుల నుంచి బెదిరింపులు, ప్రజాప్రతినిధుల అనుచరులు దాడులు సైతం చేశారు. అయినా నమ్మకున్న జర్నలిజాన్ని వదిలిపెట్టకుండా పోరాటం సాగించారు. అయినా ఆయన సేవలకు, పోరాటాలకు ఎలాంటి గుర్తింపు లభించలేదన్నది జగమెరిగిన సత్యం. ఏదిఏమైనా సూర్యాపేట జర్నలిస్టుల అకాల మరణాలు జర్నలిస్టుల దుర్భర పరిస్థితులు కళ్లకు కడుతున్నాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Next Story