మూసీనది ప్రక్షాళన చేసి తీరుతాం

by Sridhar Babu |
మూసీనది ప్రక్షాళన చేసి తీరుతాం
X

దిశ, చైతన్యపురి/ఎల్బీనగర్ : మూసీనది ప్రక్షాళన చేసి తీరుతామని, ఈ పరీవాహక ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్న ప్రజలకు మెరుగైన నివాసం ఏర్పరుస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమంపై శనివారం నాగోల్ లోని శుభం కన్వెంషన్ లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో 365 రోజులు మూసీ పారేలా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలపై చిత్తశుద్ధి లేదన్నారు.

కమీషన్లకు కక్కుర్తి పడి కాలేశ్వరం కట్టి కూలిపోయే దశకు తీసుకువచ్చింది బీఆర్ఎస్ సర్కార్ అని విమర్శించారు. ఒక్క రూపాయి ప్రజలపై భారం పడకుండా మూసీ ప్రక్షాళన చేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. బీఆర్ ఎస్ దరిద్రపు పాలనతో నేడు రాష్ట్రం ఇబ్బంది పడుతుందన్నారు. బీఆర్ ఎస్ చేస్తున్న చెడు ప్రచారాన్ని తిప్పి కొట్టడానికే నేడు రైతులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విష బీజం నాటే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి కార్యక్రమం నియోజకవర్గాల వారీగా రైతులతో నిర్వహించి మూసీ ప్రక్షాళన పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన ద్వారా 28 లక్షల మంది ప్రాణాలు కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

మొసలి కన్నీరు కారుస్తూ మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం ప్రతిపక్షాలకు తగదన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కంకణబద్దుడై పని చేస్తున్నందున ప్రతి ఒక్కరం స్వాగతించాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేదని, తన గ్రామం మూసీ నది ఒడ్డున ఉండడంతో చిన్నప్పుడు ఈత కొట్టేవాడివని తెలిపారు. సెలవులలో మంచినీరు తాగుతూ ఉండే వాడినని గుర్తు చేశారు. కానీ నేడు మూసీ నదిలో మురుగునీరు పారుతుండడంతో కాలు పెట్టే పరిస్థితి లేదని వాపోయారు. జహిరాబాద్ ఎంపీ సురేష్ షెత్కార్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్​ నగరం సుందరీకరణ జరిగితే యావత్ తెలంగాణకే తలమానికంగా మారుతుందన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ మూసీ నీటితో మూడు జిల్లాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి మూసీ సుందరీకరణ చైర్మన్ గా ఉంటూ రూ.1000 కోట్లు ఖర్చు చేసి ఏమి చేశావో చెప్పాలని సుధీర్ రెడ్డిని ప్రశ్నించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూసీ నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూసీ నది ప్రక్షాళన కావాలని నూటికి 90 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎల్బీనగర్, మలక్ పేట నియోజకవర్గంలో 3 వేల మందికి ఇబ్బంది జరగొచ్చు కానీ వారందరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగానే కేసీఆర్, కేటీఆర్ లు ఆ నదిలో పొర్లుతున్నారని ఎద్దేవా చేశారు. మూసీలో చెత్త కానీ మట్టి కానీ తీయకపోగా విమర్శలు చేస్తారా అని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూసీ నదిలో కొబ్బరి నీళ్లు పారిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. మూసీ నది ఒడ్డున జీవం సాగించే ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణబద్దుడయ్యాడని తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన ఏ ప్రభుత్వం చేపట్టినా దానికి మద్దతు తెలపడం తన బాధ్యత అన్నారు. మూసీ నది ఇలాగే కొనసాగితే 2030 వరకు హైదరాబాద్​ పూర్తిగా నీట మునుగుతుందని పరిశోధకులు చెబుతున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర ప్రజలకు అందించనున్నట్టు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బండ్రు శోభారాణి, పున్న కైలాష్ నేత, చెవిటి వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Next Story