- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే ఇండోర్ స్టేడియం.. లోపల సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, వైరా: జిల్లా సమగ్రాభివృద్దే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ అభివృద్ధి పనులను వేగవంతంగా చేయించేందుకు నిరంతరం పని చేస్తుంటే కొంతమంది అధికారులు, కాంట్రాక్టులు మాత్రం తమ ధన దాహం వల్ల నిధులు కేటాయించిన ప్రభుత్వానికి మాయని మచ్చ తెస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులను కలెక్టర్ నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
కానీ ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంతో అభివృద్ధి పనుల లక్ష్యం నెరవేరకపోగా ప్రభుత్వానికి అపకీర్తి తెస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ అసమర్ధతతో వైరాలోని ఇండోర్ స్టేడియం పైన పటారం.. లోన లొటారంగా మారింది. వర్షం వస్తే చాలు.. ఇండోర్ స్టేడియం పైకప్పు రేకుల నుంచి ధారలా నీరు లీకు అవుతుంది. అయినా ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
రూ.1.19 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం
వైరాలో ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేక బాలారిష్టాలను ఎదుర్కొంది. 2005లో ఉమ్మడి రాష్ట్రంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ స్టేడియం నిర్మాణాన్ని అప్పట్లో చేపట్టిన కాంట్రాక్టర్ గోడలు కట్టి, రేకులు వేసి మిగిలిన పనులు చేయలేనని చేతులెత్తేశారు. అనంతరం సంవత్సరాల తరబడి ఈ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరో రూ.89 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో గత రెండేళ్ల క్రితం పనులు చేపట్టారు.
స్టేడియంలో రెండు ఉడెన్ షటిల్ కోర్టులు నిర్మాణంతో పాటు ఇతర పనులను పూర్తి చేశారు. అయితే ఈ పనులు పూర్తి చేసినప్పటి నుంచి పైకప్పు నుంచి వర్షం వచ్చిన ప్రతిసారి లీకు కావడంతో స్టేడియంలోకి నీరు వస్తుంది. ఇటీవల ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇండోర్ స్టేడియం అభివృద్ధికి మరో రూ.1.17 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఇండోర్ స్టేడియం బయట లాన్ టెన్నిస్ కోర్ట్, ప్రస్తుతం ఉన్న ఇండోర్ స్టేడియంలో మరో రెండు షటిల్ వుడెన్ కోర్టులు, ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
అయితే ఇండోర్ స్టేడియంలో మరో రెండు షటిల్ కోర్టులు నిర్మించేందుకు వుడెన్ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రేకుల నుంచి నీరు కారుతుండటంతో గతంలో నిర్మించిన రెండు కోర్టులతో పాటు, ప్రస్తుతం నిర్మిస్తున్న మరో రెండు ఉడెన్ కోర్టులు తడిచి దెబ్బతింటున్నాయి. గత సంవత్సర కాలంగా రేకుల కప్పు నుంచి నీరు దారలా కారుతున్నా శాశ్వత పరిష్కారానికి ఎవరు చొరవ చూపడం లేదు.
కలెక్టర్ సారూ.. మీరే దృష్టి సారించాలి
వైరాలో ప్రస్తుతం రూ.1.17 కోట్లతో జరుగుతున్న పనులను ఇప్పటికే అనేకసార్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పనులను త్వరతగతిన పూర్తి చేయించాలనే సంకల్పంతో కలెక్టర్ ఉన్నారు. అయితే గతంలో జరిగిన ఇండోర్ స్టేడియం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో స్టేడియం నిర్మాణ పనులను అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను కలెక్టర్ గౌతమ్ నిరంతరం పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్ మరోసారి పరిశీలించి పైకప్పు నుంచి వర్షం నీరు కురవకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు.