- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ వైపు.. గులాబీ ఎమ్మెల్యేల చూపు!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫౌమ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. వారం రోజులుగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. మంత్రులతో వరుస మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో మరికొందరు భేటీ అవుతున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీలవైపు మొగ్గుచూపుతుండటం, పార్టీ అధిష్టానం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో లీడర్లు, కేడర్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, ప్రభుత్వాన్ని కోల్పోవడంతో గులాబీ అధినేత కేసీఆర్ ఫౌమ్ హౌజ్‌కు వెళ్లారు. అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే జనం మధ్యలోకి రాకపోవడంతో కేడర్ కొంత నైరాశ్యంలో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సైతం ఆశించిన మేర ప్రశ్నించడం లేదని చర్చ మొదలైంది. రైతుబంధు, రైతుబీమా, 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు.
కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం తప్ప ప్రత్యక్ష కార్యక్రమాలు చేపట్టడం లేదని పలువురు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేడర్‌ను ఉత్తేజపర్చాలంటే, వారిని ఓటమినుంచి బయటపడేయాలంటే పార్టీ కార్యక్రమాలు తప్పనిసరి. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం ఫౌమ్ హౌజ్‌కే పరిమితం కావడంతో మరింత నైరాశ్యం నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలో కేటీఆర్, హరీశ్‌రావు
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంపై ఢిల్లీకి ఈనెల 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లగా.. మరుసటి రోజు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు నేతలు ఢిల్లీలో ఉండటంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు తగ్గాయి. ఢిల్లీలో వారు బీజేపీ నేతలతో సైతం చర్చలు జరుపుతున్నారనే ప్రచారం స్టార్ట్ అయింది. వారి వారి నియోజకవర్గాల్లో సైతం వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. అయితే ఏం జరుగుతుందో తెలియక కేడర్ అయోమయంలో పడ్డారు. మంగళవారం మాత్రం మీడియా ముందుకు వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫైట్ చేస్తామని, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు వెళ్తామని అర్హత వేటు పడేవరకు ఊరుకోబోమని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారా? అనే చర్చమొదలైంది.
కాంగ్రెస్‌వైపు ఎమ్మెల్యేల చూపు
ఇదే అదునుగా భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వస్తుండటంతో అటు వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఏకంగా సీఎం, మంత్రులతో భేటీ అవుతున్నారు. ఏకంగా చేరికకే సంప్రదింపులు జరుపుతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు కూడా చేరికకు సన్నద్ధమవుతున్నారు. మరికొంతమంది ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. పార్టీ నేతలపై ఫోకస్ తగ్గడంతో ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలియక కేడర్ ఆందోళనకు గురవుతున్నారు.
ఫామ్ హౌజ్ నుంచి వస్తే తప్ప..
పార్టీ మారే ఆలోచన ఉన్న నేతలను కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పిలిపించుకొని మాట్లాడుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ నేతలను కారుదిగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన దగ్గర నుంచి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆయనే పార్టీ మారగా, మిగిలినవారెంతా అనేది కూడా చర్చజరుగుతుంది. ఎవరిపై నమ్మకం ఉంచుకోవాలో తెలియక పార్టీ సైతం చేతులు ఎత్తేసినట్లు సమాచారం. వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను వీడి జనం మధ్యకు వస్తే తప్ప పార్టీ బలోపేతం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా కేడర్‌లో సైతం మనోధైర్యం కలుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల్లో సైతం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీలో ఆసక్తికర చర్చకొనసాగుతుంది.