స్టేషన్ల పెంపు ఓకే.. బట్ నో స్టాఫ్!

by Rajesh |
స్టేషన్ల పెంపు ఓకే.. బట్ నో స్టాఫ్!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాజధాని నగరంలో పోలీస్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమన్న ప్రభుత్వం స్టేషన్ల సంఖ్యను మాత్రమే పెంచి చేతులు దులుపుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభాకు, స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా స్టాఫ్ ను ఎందుకు పెంచడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జంట నగరాల్లో ప్రస్తుతం 85 లక్షల వరకు జనాభా ఉండగా, సుమారు 17వేల మంది సిబ్బంది అవసరముంటుంది. అయితే ప్రస్తుతం 5967 మంది మాత్రమే పని చేస్తుండడంతో, వారిపై తీవ్ర పని భారం పడుతున్నది.

సీపీ నేతృత్వంలో కమిటీ వేసి..

హైదరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయటానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని కొంతకాలం క్రితం సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆరునెలలపాటు అధ్యయనం చేసిన ఈ కమిటీ, పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా, వెంటనే ఆమోదముద్ర పడింది.

కొత్తగా జోన్లు, సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు

జంట నగరాల్లో పోలీస్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో రెండు కొత్త జోన్లు సౌత్ ఈస్ట్, సౌత్వెస్ట్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. దాంతోపాటు కొత్తగా 11 ఏసీపీ సబ్ డివిజన్లు, 11 పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్టు వివరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే సిబ్బంది సంఖ్యను ఏమాత్రం పెంచకుండా ఉన్న ఏసీపీ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో కొన్నింటి పరిధులను రెండుగా విడగొట్టడం.

కొత్తగా ఏర్పాటు చేసిన ఏసీపీ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లను కవర్ చేయటానికి కొత్తగా రెండు డీసీపీ జోన్లను ఏర్పాటు చేయడం. ఇంకా కొత్తగా ఏర్పాటైన ఏసీపీ సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలను అందుబాటులోకి తేవకపోవడం. అయితే అదనపు సిబ్బందిని కేటాయించకపోతే కొత్తగా స్టేషన్లను ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని సీనియర్ పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

ఉన్నది 5967 మందే..

పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ 500 మంది పౌరులకు ఒక పోలీస్ ఉండాలి. 2021లో కమిషనరేట్ పరిధిలో 80 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం 85 లక్షలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సంఖ్య కేవలం 5,967. అంటే ప్రతీ 1,425 మంది ప్రజలకు ఓ పోలీస్ చొప్పున ఉన్నారు. ఉన్న సిబ్బందిలో సైతం రెండు శాతం వరకు రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారు.

మరో రెండు నుంచి మూడు శాతం వరకు పరిపాలనా పరమైన విధులు, కోర్టు డ్యూటీలు చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారి సంఖ్య నాలుగున్నర వేల వరకు మాత్రమే ఉంటుంది. జనాభా పరంగా చూస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 17 వేల మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం దీంట్లో సగం మంది కూడా లేరు. దీంతో ఒక్కసారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎప్పుడు ఇండ్లకు పోతామో తెలియని పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తున్నామని కానిస్టేబుళ్లు వాపోతున్నారు. పునర్ వ్యవస్థీకరణలో 62గా ఉన్న పోలీస్ స్టేషన్లు 78కి పెంచారని, అయితే సిబ్బందిని పెంచకపోవడంతో పని భారం మరింత పెరిగిందని ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెక్రటేరియట్ స్టేషన్ ఎందుకు?

కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ ను ఎందుకు పెడుతున్నారో అర్థం కావటం లేదని సీనియర్ పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే సచివాలయంలో 600 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే 400 మందిని అదనంగా నియమించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్కే భవన్ లో కొత్తగా సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయటం, దానికి ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 20 మంది కానిస్టేబుళ్లను అలాట్చేయటం ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

దేశంలోని వివిధ నగరాల్లో జనాభా, స్టేషన్లు, సిబ్బంది సంఖ్య ఇలా..

నగరం జనాభా పోలీస్ సిబ్బంది

హైదరాబాద్ 85 లక్షలు 5967

బెంగళూరు 87.29 లక్షలు 12,000

చెన్నయ్ 89 లక్షలు 13,000

ముంబై 1.40 కోట్లు 95,000

Advertisement

Next Story

Most Viewed