TG Govt: వికారాబాద్ ఘటనలో అనూహ్య పరిణామం.. చిక్కుల్లో కేటీఆర్?

by Prasad Jukanti |   ( Updated:2024-11-12 10:39:58.0  )
TG Govt: వికారాబాద్ ఘటనలో అనూహ్య పరిణామం.. చిక్కుల్లో కేటీఆర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ దాడి (Vikarabad Incident) ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నది. మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)తో వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి మంత్రితో సమావేశం అయి నిన్నటి ఘటనను శ్రీధర్ బాబుకు వివరించారు. ప్రజాభిప్రాయానికి వెళ్లిన కలెక్టర్ తో పాటు పలువురు అధికారులపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సైతం ఆ కోణంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

గులాబీ వ్యూహం గురితప్పిందా?:

ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత సురేష్ పై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామంలోకి వెళ్లేలా చేసిన సురేశ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy)కి ముఖ్య అనుచరుడు అని ఈ దాడి ఘటనకు ముందు సురేశ్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ లో మాట్లాడితే ఆరు సార్లు కేటీఆర్ (KTR) తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ కు బూమ్ రాగ్ గా మారబోతున్నదా అనే చర్చ తెరమీదకు వచ్చింది. అధికారులపై ప్రజల తిరుగుబాటును పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు వ్యూహాత్మకంగా దాడికి ప్రణాళికులు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల కుట్ర కోణం తెలియక ప్రజలతో మాట్లాడేందుకు అమాయకంగా వచ్చిన అధికారులపై దాడికి పాల్పడం, అంతకు ముందు మాజీ ఎమ్మెల్యేతో కేటీఆర్ టచ్ లో ఉన్నారనే ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్ గా మారుతోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్న తరుణంలో ఈసారి ఏకంగా కలెక్టర్, అధికారుల దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర తేలితే అంతిమంగా అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed