ప్రశ్నల్లేవ్.. జవాబుల్లేవ్.. ఒకటే రచ్చ.. !

by srinivas |
ప్రశ్నల్లేవ్.. జవాబుల్లేవ్.. ఒకటే రచ్చ.. !
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి చర్చలు, జవాబుల్లేకుండానే నిరవధిక వాయిదా పడింది. శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో కేవలం మూడు గంటల పాటే కొనసాగి, నాలుగు సార్లు వరుసగా వాయిదా పడింది. బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల నినాదాలు, తోపులాటలు, వాగ్వాదాలు, నిరసనల మధ్య సమావేశం జరిగింది. సభను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన ప్రయత్నాలన్ని విఫలంకావడంతో ఆమె తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

ప్రజాసమస్యలు, అభివృద్ధి, వర్షాకాలం సహాయక చర్యలపై ఎలాంటి చర్చ లేకుండానే, కార్పొరేటర్ల ప్రశ్నలకు అధికారులెలాంటి సమాధానం చెప్పకుండా సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించటం పట్ల పలువురు సభ్యులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమావేశం మొదలుకాగానే, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు నల్ల కండువాలు ధరించి మేయర్ పొడియంను చుట్టుముట్టారు. మళ్లీ సభ మొదలుకాగానే, ట్యాక్స్ కలెక్షన్ ఫుల్..అభివృద్ధి నిల్ అంటూ బీజేపీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించరాదని బీఆర్ఎస్, బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ దోస్తీ సమస్యలతో ప్రజలు కుస్తీ అన్న నినాదాలున్న ప్రకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టారు.

దీంతో తీవ్ర అసహనానికి గురైన మేయర్ సభ జరిగేందుకు సహకరించాగలని కోరినా వారు స్పందించకపోవటంతో సభను 11 గంటలకు 15 నిమిషాల పాటు టీ బ్రేక్‌గా వాయిదా వేశారు. టీ బ్రేక్ తర్వాత తిరిగి పారంభమైన కార్పొరేటర్లు తమ నిరసనలు, నినాదాలు మానలేదు. ఫలితం లేకుండా పోవడంతో మేయర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తిరిగి సభలో ప్రారంభించగానే మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకోవడంతో సభలో ఏం జరుగుతుందన్న అయోమయం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. అంతలో మార్షల్స్ రంగప్రవేశం చేసి బీజేపీ కార్పొరేటర్లను బయటకు పంపించే ప్రయత్నం చేయగా, బీజేపీ కార్పొరేటర్లు కొందరు మార్షల్స్‌పై ఎగబడ్డారు.

కనీసం సభకు హాజరైన 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ అనుభవాన్ని వివరించేలా మాట్లాడేందుకు అనుమతించి, వారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలంటూ మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నచ్చజెప్పేందుకు యత్నించిన ఫలితం లేకుండాపోయింది. రెండోసారి సభ వాయిదా పడినప్పుడు సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎంత కోరినా, వారు వినిపించుకోకపోవటంతో మరోసారి చైర్‌లోకి వచ్చిన మేయర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జ్వరంతో ఉన్నా, రావాలా?

ఆ తర్వాత కొత్త కమిషనర్ ఆమ్రపాలి, ఇతర ఐఏఎస్ ఆఫీసర్ల పరిచయ కార్యక్రమం జరిగింది. జలమండలి నుంచి ఎవరైనా వచ్చారా? అంటూ మేయర్ ప్రశ్నించగా, ఆపరేషన్ విభాగం అధికారి వచ్చారని చెప్పగా, ఎండీ ఎందుకు రాలేదంటూ బీజేపీ కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో ఎండీ గురించి కనుక్కొవాలని కమిషనర్‌కు సూచించగా, ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపతున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. అయినా రావల్సిందేనని బీజేపీ కార్పొరేటర్లు భీష్మించుకోవటంతో సభకు పిలిపించాలని మేయర్ సూచించారు. రెండోసారి సభ వాయిదా అనంతరం మరోసారి చైర్‌లోకి వచ్చిన మేయర్ జలమండలి ఎండీ సభకు రాకముందే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మీకు సిగ్గుందా..పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిందెవరు? - మేయర్

పార్టీ మారి, మేయర్ పదవిలో కొనసాగుతున్న మేయర్, డిప్యూటీ మేయర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, పార్టీ పిరాయింపులను ప్రోత్సహించారదంటూ నినాదాలు చేయడంతో ఘాటుగా స్పందించిన మేయర్ విజయలక్ష్మి మీకు అసలు సిగ్గుందా? పార్టీ పిరాయింపును మొదలుపెట్టిందెవరు. అది అందరికీ తెలుసునని సమాధానమిచ్చారు. మీకు సబ్జెక్ట్ లేదు? చట్టాలపై అవగాహన లేదు? ఎందుకు సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభ సక్రమంగా జరగనివ్వొద్దన్న ఉద్దేశ్యం, మైండ్‌సెట్‌తో వచ్చిన మీకు, మిమ్మల్ని ఇక్కడకు పంపిన వారికి చట్టాలపై అవగాహన లేదన్న విషయం తేలిపోయిందన్నారు. సభకు విచ్చేసి, సభ ముందుకు సాగకుండా అడ్డుపడటం జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోనుందన్నారు.

Advertisement

Next Story