సౌదీలో ఐపీఎల్ మెగా వేలం?

by Harish |
సౌదీలో ఐపీఎల్ మెగా వేలం?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ మెగా వేలం కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. నవంబర్ చివరి వారంలో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. మెగా వేలం ఎక్కడ నిర్వహించాలనే దానిపై బోర్డు ఆలోచిస్తున్నది. ఈ సారి వేదికగా సౌదీ అరేబియాను అనుకుంటున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఇంకా సౌదీలో నిర్దిష్టమైన ప్రదేశం ఖరారు కానప్పటికీ.. రియాద్, జెద్దా సిటీలు బోర్డు అధికారుల దృష్టిలో ఉన్నట్టు పేర్కొంది. గతేడాది వేలం యూఏఈలోని దుబాయ్ వేదికగా జరిగింది. ఈ సారి కూడా దుబాయ్ ఒక ఎంపికగా ఉన్నప్పటికీ మరోసారి అక్కడే నిర్వహించడానికి బోర్డు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. మెగా వేలం రెండు రోజులపాటు జరగనుంది. వేలానికి వేదికను ఎంపిక చేయడం బోర్డుకు సవాల్‌గా మారినట్టు అర్థమవుతుంది. గతంలో లండన్‌ను షార్ట్ లిస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అక్కడ ఈ సమయంలో చల్లటి వాతావరణం కారణంగా లండన్‌లో వేలం నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. దుబాయ్‌తో పోలిస్తే సౌదీలో ఖర్చులు ఎక్కువ అని నివేదించింది. రెండు రోజులపాటు వేలాన్ని నిర్వహించడంతోపాటు సరైన వసతి కల్పించే వేదిక కోసం బీసీసీఐ అధికారులు వెతుకుతున్నారు. వేలంలో 10 ఫ్రాంచైజీల ప్రతినిధులతోపాటు లీగ్ బ్రాడ్‌కాస్టర్స్ జియో, డిస్నీ స్టార్‌లకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొనునున్నారు. మెగా వేలం వేదికపై త్వరలోనే స్పష్టత రానుంది.

Advertisement

Next Story

Most Viewed