సీఎం కేసీఆర్ సభ మరుసటి రోజే టీఆర్ఎస్‌లో లుకలుకలు!

by GSrikanth |   ( Updated:2022-08-30 12:50:56.0  )
సీఎం కేసీఆర్ సభ మరుసటి రోజే టీఆర్ఎస్‌లో లుకలుకలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ పనైనా పక్కాగా జరిగేటట్లు చూసుకునే కేసీఆర్‌కు ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు ఇబ్బందికరంగా మారాయనే చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి మరోసారి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు తెలంగాణలోని సొంత పార్టీలో లుకలుకలు సమస్యగా మారాయని తెలుస్తోంది. తాను పర్యటించి వచ్చిన మరుసటి రోజే పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్‌లో విభేదాలు బహిర్గతం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జాతీయ రాజకీయాలపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపు ఆయన బిహార్ టూర్‌కు సిద్ధమయ్యారు.

ఇంతలో పెద్దపల్లి జిల్లా రామగుండం మేయర్‌పై సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబావుట ఎగురవేశారు. మంగళవారం జరిగిన రామగుండం నగర పాలక సమావేశంలో మేయర్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. రెండు కోట్ల రూపాయల ఎజెండాపై మేయర్ ను నిలదీశారు. తమ డివిజన్లలో సమస్యల గురించి పట్టించుకోవడం లేదని, అలాగే నిధుల మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సమావేశాని టీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటన టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ వద్ద ఫిర్యాదు చేసేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధం అయ్యారు.

పార్టీలో వరుస కుదుపులు:

రాజకీయ పార్టీలు అన్నాక అలకలు, బుజ్జగింపులు సహజమే. కానీ పార్టీ అంతా అధినేత కేసీఆర్ కంట్రోల్ లో ఉందని, నేతలెవరూ బాస్ ఆదేశాలను జవదాటరని చెబుతున్న టీఆర్ఎస్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. మరోవైపు మునుగోడు అభ్యర్థి విషయం ఓ కొల్కివచ్చినట్లుగా కనబడటం లేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్థానిక నేతలు హెచ్చరించడంతో అభ్యర్థిని ప్రకటించే విషయంలో మరికొంత కాలం ఎదురు చూడాలని అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వైపు బీజేపీ దూకుడు పెంచుతున్న క్రమంలో వరుస కుదుపులు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి ఈ తరహా అసమ్మతి రాగాలు మరింత పెరిగితే అది పార్టీకి తీరన నష్టం దిశగా తీసుకుపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ట్రబుల్స్‌ను గులాబీ బాస్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed