3న ఆ తేదీ ప్రకటిస్తా.. అభ్యర్థులపై సీఎం కేసీఆర్ సీరియస్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-01 16:16:35.0  )
Telangana CM KCR Plans to establish National Media
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ కేకే, పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పోలింగ్ పై ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు, హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, పాలమూరు ఎమ్మెల్యేలతోపాటు మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కేసీఆర్ ను కలిశారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశారు. క్షుణ్ణంగా సమీక్షించినట్లు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. ఏయే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత మార్జిన్ వస్తుందని ఆరా తీసినట్లు సమాచారం. సర్వేలను, ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని... పార్టీ పీడ్ బ్యాక్ సేకరించిన ఆధారంగా బీఆర్ఎస్ గెలుస్తుందని నేతలకు కేసీఆర్ సూచించారు. గత సీట్లకంటే కొన్ని తగ్గుతున్నాయని నేతలతో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. దక్షిణ భారత్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

పలువురికి మందలింపు...

బీఆర్ఎస్ వందరోజుల ముందు పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించినప్పటికీ ఎందుకు ఓటుగా మాల్చుకోలేకపోయారని సర్వేల ఫీడ్ బ్యాక్ ను బట్టి కేసీఆర్ మందలించినట్లు సమాచారం. తీరు మార్చుకోవాలని, కేడర్ ను, నేతలను కలుపుకొని పోవాలని ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం బేఖాతర్ చేశారని, అందుకు వారే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడినట్లు సమాచారం. వారి ప్రభావం పార్టీపై కూడా పడుతుందని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.

3న ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తా

అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ ఈనెల 3న జరుగుతుందని, అదే రోజూ సాయంత్రం ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తామని కేసీఆర్... నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నాయని, ఎవరు అదైర్ఘ్య పడొద్దని.. ఇచ్చిన హామీలు నెరవేరుద్దామంటూ నేతల భేటీలో అధినేత చెప్పినట్లు తెలిసింది. వచ్చేది మన ప్రభుత్వమే అని అభయమిచ్చారు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని, అందరూ ప్రశాంతంగా ఉండాలని.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామని కేసీఆర్ నేతలకు ధీమా కల్పించారు.

కవితను ఇంట్లోనే కలిసిన ఉమ్మడి నిజామాబాద్ నేతలు

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో నేతలంతా శుక్రవారం హైదరాబాద్ లో కవితతో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలతో నేతలు రావడంతో వారితో సుధీర్ఘంగా చర్చించారు. ఏయే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ఎన్ని ఓట్లు పడ్డాయని కవిత ఆరా తీసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed