రాష్ట్ర ప్రభుత్వ లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం

by GSrikanth |
రాష్ట్ర ప్రభుత్వ లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డి బ్యారేజీ డ్యామేజీపై అధ్యయనం చేసి పటిష్టతపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఫిబ్రవరి 13న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందాన్ని పంపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే ఈ కమిటీ మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి వాటి పటిష్టతపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. కమిటీ చైర్మన్‌గా చంద్రశేఖర్ అయ్యర్‌ను ఎంపిక చేసినా మిగిలిన నలుగురు సభ్యుల పేర్లను శుక్రవారం వెల్లడించనున్నది.

ఎవరో ఒకరు ఊచల వెనక్కి వెళ్ళక తప్పదు :

కమిటీ ఏర్పాటు గురించి జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ను పాత్రికేయులు ప్రశ్నించగా, కమిటీ ఏర్పాటుపై జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని బదులిచ్చారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తుందని, నెల రోజుల వ్యవధిలో ప్రాథమిక నివేదిక ఇస్తుందని వివరించారు. మేడగడ్డ బ్యారేజీ కట్టిన తీరుపై తీవ్రమైన కామెంట్లు చేసిన ఆయన... నిర్మాణానికి ముందే సాయిల్ టెస్టు ద్వారా నేల స్వభావాన్ని విశ్లేషించాల్సి ఉన్నదని, కానీ అది జరగకుండానే నిర్మాణమైందన్నారు. ఈ నిర్లక్ష్యానికి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు జైలు ఊచలు లెక్కించకతప్పదన్నారు. సమయమే దాన్ని నిర్ణయిస్తుందన్నారు. వర్షాలకు ముందు, తర్వాత జరగాల్సిన మాన్‌సూన్ స్టడీ కూడా జరగలేదన్నారు.

ప్రమాదంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ :

ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజీ గురించి ఆలోచిస్తున్నప్పటికీ చాలాకాలం క్రితం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, మెయింటెనెన్స్ పై సీరియస్ దృష్టి పెట్టలేదని వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టులూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నవేనని, ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని, రెండు ప్రాజెక్టుల్లోని నీటి వాటాల గురించి మాట్లాడుతున్నాయే తప్ప వాటి నిర్వహణ, రెగ్యులర్‌గా జరగాల్సిన మెయింటెనెన్స్ గురించి ఆలోచించడంలేదన్నారు. లెక్క ప్రకారం శ్రీశైలం మెయింటెనెన్స్ ను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం చూసుకోవాల్సి ఉన్నదని, కానీ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణతో ఒక రాష్ట్రానికి చెందినవారు మరో రాష్ట్రం పరిధిలోకి వెళ్ళకుండా పరస్పరం ఆంక్షలు పెట్టుకోవడంతో మెయింటెనెన్స్ గాలికి పోయిందన్నారు. ఈ రెండూ ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాలు ఈ మధ్యనే అక్కడకు వెళ్ళి ఫిజికల్‌గా తనిఖీలు చేశాయని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed