రాష్ట్రంలో కూరగాయల కొరత.. వాళ్ల మిస్టేక్స్‌తోనేనా..?

by Nagaya |   ( Updated:2022-08-08 15:56:53.0  )
రాష్ట్రంలో కూరగాయల కొరత.. వాళ్ల మిస్టేక్స్‌తోనేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అవసరానికి సరిపడా కూరగాయ పంటలు సాగుకావడం లేదు. దీంతో రాష్ట్రానికి అవసరమైన కూరగాయల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఇక్కడ కూరగాయలకు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో ఆశించిన మేర కూరగాయల పంటలు సాగుకాకపోవడంతో వచ్చే నవంబర్, డిసెంబర్‌లో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. కూరగాయల సాగుకు అవసరమైన రాయితీలు, విత్తనాలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతులు కూరగాయల సాగుపై అనాసక్తి కనబరుస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఎమ్మెస్పీ లేకపోవడంతో ఎప్పుడు ఏ కూరగాయకు ధర పడిపోతుందో, పెరుగుతుందో తెలియక అటు వినియోగదారుడు, ఇటు రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే దాదాపు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు కావాలని ఉద్యాన వన శాఖ సూచిస్తోంది. కానీ లక్ష ఎకరాల్లో కూడా సాగు కాకపోవడం గమనార్హం.

రాష్ట్ర అవసరాలకు 26 లక్షల మెట్రిక్ టన్నులు..

రాష్ట్ర ప్రజల వినియోగాలకు ప్రతీ ఏటా 26 లక్షల మెట్రిక్ టన్నుల మేర అన్ని రకాల కూరగాయలు అవసరం పడుతున్నాయి. కానీ రాష్ట్రంలో అంతమేర సాగుకాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ రోజు 8 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలను ప్రజలు వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర అవసరాలు తీరే స్థాయిలో సాగు కావడం గగనంగానే మారింది.

రాయితీలు లేవు, కోతుల బెడదతో ఇబ్బందులు

కూరగాయల సాగుకు ముఖ్యంగా రాయితీలు ఉంటే రైతులు సాగు చేసేందుకు అవకాశాలున్నాయి. కానీ ప్రభుత్వం ఈ సాగుపై ఎలాంటి రాయితీలు ఇవ్వడంలేదు. గతంలో మల్చింగ్ షీట్స్, ప్లాస్టిక్ ట్రేలు, విత్తనాలు, నారు అందించేవారు. కానీ ఇపుడు అవేమీ ఇవ్వకపోవడంతో పాటు కూరగాయల సాగుపై అవగాహనను కల్పించడం లేదు. దీంతో రాష్ట్రంలో కూరగాయల సాగు నామమాత్రంగానే ఉంది.

సాగుకు సవాళ్లు..

రాష్ట్ర అవసరాల మేరకు కూరగాయలను పండించాలని ప్రభుత్వం, ఉద్యానవన అధికారులు గతంలో నిర్ణయించినప్పటికీ ఆ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్ట ప్రాంతాల్లో వరి ఎక్కువగా సాగవ్వడం, కూలీలు దొరక్కపోవడం, మరో వైపు కోతుల బెడద తీరకపోవడంతో సాగుపై రైతులు అనాసక్తి కనబరుస్తున్నారు. ఇదే క్రమంలో రాయితీలు, సౌకర్యాలు లేకపోవడం మరో కారణంగా ఉంది. ఇప్పటికే బడ్జెట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న హార్టీకల్చర్ డిపార్ట్ మెంట్‌కు కూరగాయల సాగుకు రాయితీలు అందించే అంశం శిరోభారంగా మారింది.

ఈ సీజన్‌లో ప్రస్తుత సాగు 20,635 ఎకరాల్లో..

రాష్ట్ర అవసరాల మేరకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు కావాల్సి ఉన్నా గత మూడేళ్ల నుంచి కూడా ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుత 2022–23 వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 20,635 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యాయి. కాగా 2021 వానాకాలంలో 74,963 ఎకరాలు, 2022లో 98,051 ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఇంకా 77,416 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు కావాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాలపై ఆధారం..

కూరగాయల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత అవసరాలకు రాష్ట్రం నుంచి కొంతమేర వస్తున్నా.. 60 శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. టమాట, ఆలుగడ్డ, ఉల్లి, పచ్చిమిర్చి, దొండకాయ, వంకాయ, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఇతర కూరగాయలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తస్ గఢ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ ఏడాది సాగైన కూరగాయల వివరాలు..8–8–2022 వరకు..



Advertisement

Next Story

Most Viewed