తెలంగాణలో ఆ ఫార్ములా.. రాష్ట్రంపై ప్రియాంక స్పెషల్ ఫోకస్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-15 05:15:28.0  )
తెలంగాణలో ఆ ఫార్ములా.. రాష్ట్రంపై ప్రియాంక స్పెషల్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కర్ణాటక ఫార్ములాను కాంగ్రెస్ అమలు చేయాలనుకుంటున్నది. గ్రూపులు, వర్గాలు లేకుండా ఆ రాష్ట్రంలో అనుసరించిన సూత్రాన్నే తెలంగాణలోనూ అమలుచేసి సక్సెస్ కావాలనుకుంటున్నది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అన్ని స్థాయిల్లోనూ నేతలు పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చేందుకు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలనే స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నది. ప్రియాంకాగాంధీ సారథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఇటీవల నిర్వహించిన యూత్ డిక్లరేషన్ ఈవెంట్‌కు హాజరైన ఆమె... ‘ఇకపైన తరచూ వస్తూ ఉంటాను’ అని చెప్పారు. దీంతో పార్టీ లీడర్లకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లైంది.

స్పెషల్ ఫోకస్

లీడర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, స్థాయీ భేదాలు ఉన్నా పార్టీ కోసం వాటిని పక్కన పెట్టి సమష్టిగా పనిచేశారని, అదే ఆ రాష్ట్రంలో సక్సెస్ తీసుకొచ్చిందని తెలంగాణ లీడర్లంతా గుర్తించారు. గ్రూపులుగా చీలిపోయిన నేతలను ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు ప్రియాంకాగాంధీ చొరవ తీసుకోనున్నారు. ఇకపైన వీలైనంత ఎక్కువ సమయాన్ని రాష్ర్టానికి కేటాయించనున్నారు. ఆమె కోసం హైదరాబాద్‌లో గెస్ట్ హౌస్‌ను వెతికే పని ఇప్పటికే మొదలైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పదేళ్ల నుంచి ఉనికి కోసం కష్టపడుతున్న పరిస్థితి నుంచి అధికారంలోకి తేవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రూపులతో పార్టీకి నష్టం

గ్రూపు రాజకీయాలు పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందన్నది బహిరంగ రహస్యం. గతంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ దృష్టికి వర్గ పోరు విషయాన్ని తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. పీసీసీ చీఫ్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆయనపై బహిరంగ విమర్శలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీ అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని ఠాగూర్ స్థానంలో మాణిక్‌రావు థాక్రేను నియమించింది. ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న నేతలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయినా కొద్దిమంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌ రోల్ పోషించకపోవడం వెలితిగానే ఉంది.

అధికారంలోకి రావడమే లక్ష్యంగా..

రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పార్టీలోని అంతర్గత ఘర్షణలు ఇబ్బందికరంగా పరిణమించాయన్నది హైకమాండ్ భావన. సీనియర్లను కలుపుకుపోవడంలో పీసీసీ చీఫ్ వైఫల్యం కావడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సీనియర్ల నుంచి సహకారం లేకపోవడం, పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరిపే కార్యక్రమాల్లో కొద్దిమంది గైర్హాజరు కావడం.. వంటి అంశాలన్నీ పార్టీ పటిష్టతకు ప్రతిబంధకంగా మారాయని అగ్రనాయకత్వం గుర్తించింది. వీటన్నింటిని చక్కదిద్దడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో హైకమాండే డీల్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రియాంక మార్క్

రాహుల్‌గాంధీ పనితీరుతో పోలిస్తే ప్రియాంకాగాంధీ స్టైల్ భిన్నంగా ఉంటుందని, వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీకి నష్టం కలిగించే వారిపై ఆమె కఠినంగా ఉంటారని.. నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించి సక్సెస్ కాలేకపోయినా కర్ణాటకలో మాత్రం ఆమె ఫార్ములా పనిచేసిందని, అందుకే భారీ విజయం సాధ్యమైందని గుర్తుచేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నది నిజమేనని, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాతో ఉన్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు.. ఇలా వివిధ స్థాయిల్లోని నేతలు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడంలేదు.

ఐక్యంగా ముందుకు..

రానున్న కాలంలో ప్రియాంక గైడెన్సులో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ మెరుగైన అవకాశాలు వస్తాయని పీసీసీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు అసంతృప్తి, అసమ్మతికి ఆస్కారం లేకుండా చేయడంలో ప్రియాంక తనదైన పాత్రను పోషించనున్నారు. నేతలను ఐక్యంగా ముందుకు నడిపించనున్నారు.

Read More: కాంగ్రెస్ పగటి కలలు.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Advertisement

Next Story