- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt.: టూరిజం పాలసీ డ్రాఫ్ట్ సిద్ధం..! ఈ నెలాఖరులోగా కేబినెట్ ఆమోదం?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టూరిజంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలుమార్లు టూరిజం శాఖ అధికారులతో సమీక్షించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘టూరిజం పాలసీ-2025-30’ని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పాలసీలో కీలక అంశాలు ఉన్నట్లు తెలిసింది. పర్యాటకానికి కొత్త సొబగులు అద్దడంతోపాటు స్థానిక యువత ఉపాధికి బాటలు వేయడం, ఆదాయ వనరులు పెంచే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులున్న రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు నూతన పర్యాటక విధాన ముసాయిదాకు ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదను పరిరక్షించడంతోపాటు ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటికే పాలసీకి సంబంధించిన డ్రాప్టును సిద్ధం చేయగా.. ఈ నెలాఖరులోగా పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణలో ఇప్పటి వరకు ప్రత్యేక టూరిజం పాలసీ లేదు. ఈ పాలసీ ఆమోదం పొందితే తెలంగాణలో తొలి పాలసీ తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంగా రికార్డు సాధించనుంది.-
8 స్పెషల్ టూరిజం ఏరియాలు..
రాష్ట్రంలో హైదరాబాద్ తోపాటు పలు ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించ్చేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం 8 స్పెషల్ టూరిజం ఏరియాలు గుర్తించినట్లు సమాచారం. రామప్ప, కాళేశ్వరం, భద్రాచలం, వికారాబాద్, ఆలంపూర్ తో పాటు ఇంకా కొన్ని ప్రదేశాలను ప్రత్యేక టూరిజం ఏరియాలు గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో యాదగిరి గుట్ట, వేములవాడ, జోగులాంబ, కీసర, బాసర, భద్రాచలం, మేడారం, కొమరవెళ్లి మల్లన్న, రామప్ప లక్నవరం, వేయి స్తంభాల గుడి, వరంగల్, భువనగిరి ఖిలా, భద్రకాళి ఆలయాలు ప్రముఖ క్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. అదే విధంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ జోన్లు, కాళేశ్వరం, కిన్నెరసాని, పాలేరు, నాగార్జునసాగర్, డిండి ఇలా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు జలపాతాలు, పాకాల సరస్సు, గోదారి తీర ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే.. తెలంగాణ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండేళ్లలో టూరిజానికి సరికొత్త రూపు తీసుకొచ్చి పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపడుతున్నారు.
సర్కారుకు ఆదాయం-యువతకు ఉపాధి
టూరిజంను బలోపేతం చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలన్నీ ఈ పాలసీలో పొందుపర్చినట్లు తెలిసింది. లోకల్ యువతకు హోటల్స్, హాస్పిటల్ అంశాలపై సంబంధించి శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు పర్యాటక రంగం బలోపేతానికి పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) తో ముందుకెళ్లాలని భావిస్తుంది. దీంతో పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటక ప్రాంతాలను సైతం లీజుకు ఇచ్చి ఆదాయాన్ని రాబట్టే వ్యూహాలను రచిస్తున్నట్లు తెలిసింది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ పాలసీ రూపకల్పన చేసినట్లు సమాచారం.
ఇన్వెస్టర్లు, టూరిస్టులను ఆకర్షించేలా..
పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించడం, పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడం, విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఈ పాలసీని రూపకల్పన చేసినట్లు సమాచారం. ప్రాజెక్టులను కేటగిరి వారీగా చేసి ఐకాన్, మెగా లాంటి పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు కేటగిరీలు చేసి ఇన్వెస్టర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ భూములు ఎన్ని ఏళ్లు లీజు ఇవ్వాలి? ఏ భూములను ఎలా కేటగిరీల వారీగా చేయాలి? ధరను ఎలా నిర్ణయించాలనేది కూడా ఈ పాలసీలో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పర్యాటక భూములు ఆక్రమణకు గురికాకుండా, పర్యాటక భవనాలను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి పునర్ వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టబోతున్నారు. అదే విధంగా టూరిజం-పోలీసింగ్ విధానాన్ని అమలుల్లోకి తేనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పర్యాటకకులపై దాడులు జరుగకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. గతంలో టూరిస్టులపై దాడుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
చరిత్రను తెలిపేలా..
రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వం గైడ్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ గైడ్లు సేవలందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వారు కనిపించకపోవడంతో ఆలయాలు, ప్రాంతాల చరిత్ర టూరిస్టులకు తెలియడం లేదు. దీంతో టూరిస్టులను ఆకర్షించేందుకు టూరిజం గైడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. టూరిజం శాఖ మంత్రితోపాటు అధికారులు స్టడీ టూర్ లో భాగంగా ఇతర దేశాల్లో పర్యటించారు. ఇప్పటికే మంత్రి జూపల్లి క్రిష్ణారావు తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడానికి లండన్ లో జరిగిన వరల్డ్ ట్రావెల్స్ మార్కెట్ లో పాల్గొన్నారు. స్పెయిన్ కు వెళ్లారు. ఇలా పలుదేశాల్లో తెలంగాణ టూరిజం ప్రమోట్ చేశారు. ప్రభుత్వం తీసుకురాబోయే టూరిజం పాలసీతో టూరిజానికి మహర్దశ వస్తుందని ప్రభుత్వం చెబుతున్నది.