అమిత్‌షా‌కు అగ్నిపరీక్ష.. కోడ్ తర్వాత తొలి మీటింగ్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 11:06:02.0  )
అమిత్‌షా‌కు అగ్నిపరీక్ష.. కోడ్ తర్వాత తొలి మీటింగ్ ఇదే..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మంచి ఊపు ఉన్న సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మార్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనూ పార్టీ పట్టు సాధించే క్రమంలో ఒక్కసారిగా బండి సంజయ్ ను పక్కన పెట్టడం పార్టీలో తీవ్ర నిర్లిప్తతను నింపింది. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కమలం పార్టీకి బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు.

అమిత్‌షా‌కు అగ్నిపరీక్ష...

పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న మినీ సంగ్రామం బీజేపీకి అగ్ని పరీక్ష గానే చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత ప్రధాని మోడీ తర్వాత ఆ స్థాయి చరిష్మా ఉన్న నేతగా పేరున్న హోం మంత్రి అమిత్ షా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత తొలిసారి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్నారు. బీజేపీ జనగర్జన పేరిట జరుగుతున్న తొలి సభ అమిత్ షాకు అగ్నిపరీక్ష లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పార్టీకి సరైన దిశా నిర్దేశం లేదు. తూర్పు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు. ఇక పశ్చిమ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మరో రెండు నియోజకవర్గాల్లో గట్టి నేతలు ఆ పార్టీకి లేరు ఈ పరిస్థితుల్లో పార్టీ అగ్రనేత అమిత్ షా పార్టీకి ఎలా దిశా నిర్దేశం చేస్తారో చూడాలి. అభ్యర్థుల ఎంపికనే అత్యంత కీలకమైన నేపథ్యంలో అమిత్ షా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతున్నది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు టచ్‌లోకి వెళ్లారని వారితో అమిత్ షా టీం చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed