- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందస్తు ఎన్నికలా? రాష్ట్రపతి పాలనా? టీఆర్‌ఎస్‌లో టెన్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: ముందస్తు ఎన్నికలు ఉండవ్.. షెడ్యూలు ప్రకారమే.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అనుమానం కంటిన్యూ అవుతున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ రద్దు కావచ్చని, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు రావచ్చన్న భావనతోనే ఉన్నారు. అధినేత తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని భావిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీని రద్దుచేస్తే ముందస్తు ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన వస్తుందా? అనే సందేహం వారిని వెంటాడుతున్నది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నందున గులాబీ శ్రేణుల్లో ఈ డౌట్ ఏర్పడింది. బీజేపీతో రాజకీయ యుద్ధం కొనసాగుతున్నందున గతంలోలాగా కేంద్రం సహకరించకపోవచ్చనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతున్నది. నియోజకవర్గాల్లో తిరగాలని, ప్రజల మధ్యనే ఉండాలని, వారంలో ఆరు రోజులు అక్కడే గడపాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ ఇటీవల దిశానిర్దేశం చేశారు. వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగానూ తనను కలిసిన ఎమ్మెల్యేలకు ఇదే చెప్పారు. దీంతో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీని రద్దు చేయవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. సీఎం సూచన ప్రకారమే ఎక్కువ సమయాన్ని నియోజకవర్గాల్లో గడుపుతూ పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను అప్పటికల్లా గాడిన పడేలా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు తదితర కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఫలితాలతో అనుమానాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలుపొందడంతో 'ముందస్తు'పై టీఆర్ఎస్ నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముందస్తుపై కేసీఆర్ పునరాలోచించే అవకాశమూ ఉందన్న అభిప్రాయాన్ని కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉంటుంది? అది ఏ పార్టీకి లాభిస్తుంది? ఏ పార్టీకి చేటు తెస్తుంది? లాంటి అంశాలపై అధ్యయనం ఇప్పటికే మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తుకు వెళ్లడం ద్వారా టీఆర్ఎస్‌కు లాభమా? లేక నష్టమా? అనే దానిపై క్లారిటీ వస్తే దానికి తగిన నిర్ణయాన్ని అధినేత తీసుకుంటారని, ఆయన నిర్ణయాన్ని శ్రేణులన్నీ శిరసావహిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ 'ముందస్తు'తో టీఆర్ఎస్‌కు పెద్దగా ప్రయోజనం లేదనుకున్నప్పుడు తమ అధినేత దానికి తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ముందస్తు ఉండదని క్లారిటీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధమనే తీరులోనే పనులు చేసుకుంటున్నామని వారు గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్రం మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ముందస్తు నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహరిస్తుందోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అసెంబ్లీని రద్దుచేసినా కేంద్రం పేచీలు పెట్టి రాష్ట్రపతి పాలన పెడితే లక్ష్యం నెరవేరకపోవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ కూడా ఎలాంటి నివేదిక ఇస్తారోననే సందేహాన్ని లేవనెత్తారు.
అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం గులాబీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టింది. క్షేత్రస్థాయిలో కొన్ని సెక్షన్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీజేపీవైపు మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. నిరుద్యోగులను సంతోషపెట్టేలా 80 వేల ఉద్యోగాల భర్తీ అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ ద్వారా వెల్లడించడంతో నియోజకవర్గాల్లోని యువతను దగ్గర చేసుకోవడంపై ఫోకస్ పెట్టేలా టూర్ ప్లాన్‌ను రూపొందించుకుంటున్నారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంతో గ్రామాల్లో బీజేపీ బలపడకముందే ప్రజల్లోకి వెళ్లాలని, ఉద్యోగాల కల్పనమీద విస్తృతంగా ప్రచారం చేసుకుని మైలేజ్ పొందాలని భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయనే అంశంతో సంబంధం లేకుండా మళ్లీ గెలవడానికి, బీజేపీకి అవకాశాలు లేకుండా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
కేటీఆర్ కు ఆహ్వానం
కేసీఆర్ స్వల్ప అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నియోజకవర్గాలకు ఆహ్వానించాలనుకుంటున్నారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల దరఖాస్తులను అధికారులతో మాట్లాడి వెంటవెంటనే మంజూరు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. ముందస్తు ఉండొచ్చనే భావనతో ఇంతకాలం ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో మార్పు ఉండొచ్చనే అభిప్రాయానికి వస్తున్నారు. దీనికి తోడు కేంద్రంతో కేసీఆర్ యుద్ధానికి తలపడినందున అన్నీ ఆశించినట్లుగా జరగకపోవడచ్చనే అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- trs