ఎన్నికలపై ఎంఐఎం గురి.. టీఆర్‌ఎస్‌కు అనుకూలించేలా వ్యూహం

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-14 02:53:17.0  )
ఎన్నికలపై ఎంఐఎం గురి.. టీఆర్‌ఎస్‌కు అనుకూలించేలా వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం దృష్టిసారించింది. ఎప్పడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. గతానికి భిన్నంగా ఈ సారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని, ఏ నియోజకవర్గంలో బరిలోకి దిగితే విజయం సాధిస్తామనే వివరాలను సైతం సేకరించే పనిలో పార్టీ అధిష్టానం తలమునకలైంది. కాంగ్రెస్ కు ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువ. ఆ ఓట్లను చీల్చి ఎంఐఎం ఓటింగ్ శాతం పెంచుకోవాలని భావిస్తోంది. టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ కే ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇతేదుల్ ముస్లీం (ఎంఐఎం)పార్టీ పరితమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా 1989లో 35 స్థానాల్లో పోటీ చేసి 4 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. రెండోసారి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసి ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2009లో 8 నియోజకవర్గాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత 2014లో 35 నియోజకవర్గాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో విజయం సాధించింది. 2018 లో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే 8 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో విజయం సాధించింది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఓటింగ్ శాతం పెంచుకునేలా...

ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచుకునేలా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే 2020లో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అభ్యర్థులను బరిలో నిలిపింది. రాష్ట్రంలో 88 వార్డుల్లో విజయం సాధించింది. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సైతం అధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తుంది. 2009లో 7 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నప్పటకీ ఓటింగ్ శాతం మాత్రం 0.83 శాతం మాత్రమే ఉంది. 2014లో ఓటింగ్ శాతం 1.52శాతానికి పెరిగింది. అది 2018 ఎన్నికల్లో 2.71శాతానికి పెరిగింది. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుండటంతో మరింతగా పెంచి అధిక సీట్లు గెలువాలని భావిస్తుంది.

కాంగ్రెస్ ఓటింగ్ పై ప్రభావం...

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. ముస్లిం నేతలు సైతంల ఆపార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. అయితే ఎంఐఎం పార్టీ బలోపేతం అవుతుండటంతో ముస్లింలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వక్ఫ్ భూములు కాపాడేందుకు, మసీదుల పునర్ నిర్మాణం, మైనార్టీల విద్య బలోపేతంపై దృష్టిసారించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దుతుగా ఉండటంతో అభివృద్ధి పనులు చేపడుతూ తన మార్క్ ను చూపేడుతోంది. అదే విధంగా ముస్లింలను ఆకర్షించేలా, కాంగ్రెస్ నేతలను తమవైపునకు తిప్పుకునేలా కార్యచరణ చేపడుతున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు ప్రస్తుతం 28.4శాతం ఓటు బ్యాంకు ఉండగా దానిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు తగ్గితే పరోక్షంగా టీఆర్ఎస్ కు లాభం చేకూరే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లోనూ...

తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలపై ఎంఐఎం దృష్టిసారించింది. ఇప్పటికే యూపీ, బీహార్ తో ఏడు రాష్ట్రాల్లో పోటీ చేసింది. కానీ ప్రభావం చూపలేకపోయింది. అయినప్పటికీ పోటీ చేయడం..ఓడించడం.. గెలవడమే పాలసీ అనే నినాదంతో ఆపార్టీ అధిష్టానం ముందుకు సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్ లో పోటీ చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించే లక్ష్యంతో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టిసారించినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ కనుసన్నలలోనే ఎంఐఎం పార్టీ కార్యచరణ చేపడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనా రాబోయే ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తుండటంతో ఏ పార్టీపై ప్రభావం చూపుతోందోనని రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed