- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుంది : మంత్రి శ్రీధర్ బాబు
దిశ, రవీంద్రభారతి : దేశ విదేశాలలో తెలుగు భాష, సాహిత్యం, లలితకళల ఔన్నత్యాన్ని చాటుతున్న తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలోని 39వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. తెలుగు భాషా, సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రతియేటా వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఆయా రంగాలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖులకు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట పురస్కారాన్ని అందజేస్తుంది.
సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలనందిస్తున్న శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి 2023 సంవత్సరానికి గాను లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రంతో విశిష్ఠ పురస్కారాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ వరప్రసాద రెడ్డికి ప్రదానం చేసి మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా, సేవారంగాలలో ఉపాధి ఉన్నప్పటికినీ లలితకళా రంగాలలో కూడా ఉపాధిని పొందే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం గొప్ప నైపుణ్య శిక్షణా కేంద్రంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్న విశిష్ట పురస్కారాన్ని పొందిన వరప్రసాద రెడ్డి వ్యక్తి కాదు వైద్య రంగంలో అసమాన కీర్తిని పొందిన శక్తిగా నిలిచారని, పురస్కారానికే ప్రత్యేక గౌరవాన్ని అపాదించారని ప్రశంసించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం కేవలం రాష్ట్ర విశ్వవిద్యాలయమే కాదని, అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా పనిచేస్తూ అమెరికా, మలేషియా, మారిషస్ మొదలగు దేశాలలో తమ అనుబంధ సంస్థలు తెలుగు భాషా సాహిత్య వికాసానికై అవిరళ కృషి చేస్తున్నదని గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించడానికి ప్రభుత్వ సహకారంతో భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటుందన్నారు.
పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా. కె.ఐ. వరప్రసాద రెడ్డి తన ప్రతిస్పందన లో మాట్లాడుతూ.. మన సంస్కృతి తెలుగువారికి బలం, అస్తిత్వం అని వాటిని సమాజంలో కాపాడుకోవడానికి, అవి మరింత పరిఢవిల్లడానికి తెలుగు విశ్వవిద్యాలయం అవసరమని అందుకు ప్రభుత్వ సహకారం వాంఛనీయమని వరప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తొలుత విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అతిథులకు స్వాగతం పలుకుతూ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను, తెలుగు భాష, సాహిత్యాల ఔన్నత్యాన్ని, వాటి ప్రాభవాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపాలిటీ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్, గౌతంపొట్రు , అడిషనల్ కలెక్టర్ రాధిక , నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఎం.డి. సాబేర్ అలీ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.