దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ బెటర్ : KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-02 06:22:19.0  )
దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ బెటర్ : KTR
X

దిశ, శేరిలింగంపల్లి : మాది చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదని, దేశ ప్రగతితో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నో ప్రజారంజక పథకాలు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన 25వ ఎన్‌హెచ్‌ఆర్‌డీ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

చైనాతో జనాభాతో పోటీ పడుతున్న ఇండియా అభివృద్ధి విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉందన్నారు. చైనాతో పోల్చుకుంటే మనం అన్ని రంగాల్లోనూ దరిదాపుల్లో కూడా లేమన్నారు. చైనా మ్యాన్ పవర్‌ను సమర్ధవంతంగా వాడుకుంటే, మన దేశంలో 65శాతం యువత ఉన్నా సమర్ధవంతంగా ఉపయోగించుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. ఇలా అయితే దేశం ప్రగతి పథంలో ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. జపాన్ చిన్న దేశమైన భౌగోళికంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా ఆర్ధిక ప్రగతి సాధిస్తూ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీ గల దేశంగా ముందు వరుసలో ఉందన్నారు.

మన దేశంలో అన్నీ ఉన్నా నేటికి వెనకబడే ఉన్నామని, మన దేశంలో రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, సమయం, అభివృద్ధి, దేశ ప్రగతి కోసం ఇవ్వడం లేదని మండి పడ్డారు. మన రాజకీయ పార్టీలు ఎన్నికల మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టడం లేదని విమర్శించారు. 65శాతం మంది మధ్యవయస్కులు ఉన్నా ఎందుకు ప్రగతి సాధించడం లేదన్నారు. అదే జపాన్, చైనా ఆర్థికంగా మనకన్నా ఎలా ముందున్నాయని ప్రశ్నించారు.

ఒక్కసారైనా ఆదిశగా ఆలోచిస్తున్నామా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ చిన్న చిన్న దేశాల నుండే వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్ కన్నా చిన్న దేశం సింగపూర్ కూడా మనకన్నా ఎంతో ముందుందని తెలిపారు. మన దేశ నాయకులు చెబుతున్న మాటలు చేతల్లో లేవన్నారు. పెట్టుబడుల్లో కేంద్రం తెలంగాణ కంటే వెనకబడి ఉందని, జీడీపీలోనూ కేంద్రంకంటే తెలంగాణ ముందు వరుసలో ఉందని తెలిపారు.

ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్షన్‌లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడులకు అనుకూలంగా టీఎస్ ఐపాస్ ప్రారంభించి పెట్టుబడిదారులకు ద్వారాలు తెరిచామని, ఇలాంటిది దేశంలో ఎక్కడా లేదని, గత 75 ఏళ్లలో ఇలాంటిది ఎవరూ ప్రారంభించలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఎంతోమందికి ఉద్యోగాలు లభించాయని గుర్తుచేశారు.

యాపిల్, అమెజాన్, గూగుల్, క్వాల్ కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెట్టుబడులు, ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీలు, ఐటీ ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని, వ్యవసాయం పరుగులు పెడుతుందన్నారు. వరి పండిచడంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే పెద్దదైన ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ రంగ నిపుణులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read...

కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్!

Advertisement

Next Story