- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ! కొత్తగా చేపట్టిన మార్పులు చేర్పులు ఇవే
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయం రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ' గీతాన్ని సరికొత్త స్వరంతో విడుదల చేయబోతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రచించిన ఈ గీతంలోని కొన్ని పదాలను మార్చి స్వరాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు అన్వయించుకునేలో కొత్త మార్పులు చేస్తున్నారు. దీంతో కొత్త గీతంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ గీతంలో కొత్తగా చేపట్టిన మార్పులను గీత రచయిత అందెశ్రీ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పల్లవితో కలుపుకుని మొత్తం 12 చరణాలతో రాష్ట్ర గీతం రాబోతున్నదని చెప్పారు. అయితే ఇందులో పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొకదానికి స్వరకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది.
అందెశ్రీ వినిపించిన ప్రకారం కొత్త గీతం:
జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
1.పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
2.ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
3.కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
4.పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
5.రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
6.సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
7.కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
8.జానపదా జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
9.బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
10. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
11.గోదావరి క్రిష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా
పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!