గవర్నర్ విషయంలో తొందరపడ్డామా.. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన!

by GSrikanth |
గవర్నర్ విషయంలో తొందరపడ్డామా.. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ విషయంలో సర్కారులో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తున్నది. తమిళిసై విషయంలో తొందరపడ్డామా? అనే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఆ బిల్లులను కేంద్ర హోం శాఖ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు హోంశాఖ ఎంత సమయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఒకవేళ బిల్లుల ఆమోదం మరింత ఆలస్యమైతే ఎలా అనేది ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రశ్న.

దుమారం రేపుతున్న పేపర్ లీక్ వ్యవహారం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో రోజురోజుకూ ముదురుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్ నైతిక బాధ్యతగా టీఎస్‌పీఎస్సీ పాలకమండలితో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది? అని ఆరా తీసినట్టు ప్రచారం జరిగింది. రాజీనామా చేసేందుకు సైతం కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు మానసికంగా సిద్ధమయ్యారని టాక్. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తర్వాత కొత్త బాడీ ఏర్పాటుపై కేసీఆర్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది. రాజ్యాంగం ప్రకారం సర్వీస్ కమిషన్‌లోని చైర్మన్, సభ్యులను నియమించే అధికారం కేవలం గవర్నర్‌కు మాత్రమే ఉంది. ప్రస్తుత పాలకమండలి రాజీనామా చేసిన తర్వాత కొత్త బాడీ ఏర్పాటుకు ప్రభుత్వం పంపే ప్రతిపాదనలను బిల్లుల మాదిరిగానే గవర్నర్ పెండింగ్ లో పెడితే పరిస్థితి ఏంటని సీఎం సతమతమవుతున్నట్టు తెలుస్తున్నది.

పెండింగ్ బిల్లులపైనా సతమతం

ప్రస్తుతం పెండింగ్ ఉన్న వాటిలో ప్రయివేట్ వర్సిటీల బిల్లుపై చాలా ఆశలు నెలకొన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అసెంబ్లీ అనుమతి ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందకుండానే ఓ కీలక మంత్రి అండతో గతేడాది కొన్ని ప్రయివేట్ వర్సీటీలు అడ్మిషన్లు చేపట్టాయి. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌లో ఉన్నది. గవర్నర్ సంతకం పెడితేనే ఆబిల్లుకు చట్టబద్దత వస్తుంది. లేదంటే ఆ ప్రయివేట్ వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటనే చర్చ జరుగుతున్నది.

గవర్నర్‌పై విమర్శలు

గతంలో గవర్నర్‌పై మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్ రాజకీయాలకు అడ్డగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ ఆరో వేలుతో సమానమని విమర్శించారు. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని నిందలు వేశారు. ప్రొటోకాల్‌ను సైతం పాటించడం మానేశారు. బడ్జెట్ సమావేశాల విషయంలోనూ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం గవర్నర్‌ను ఆహ్వానించింది.

Advertisement

Next Story