ప్రజల ముందు ‘ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్’.. 12 మందితో స్పెషల్ టీం

by karthikeya |
ప్రజల ముందు ‘ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్’.. 12 మందితో స్పెషల్ టీం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సాధించిన ఫలితాలను ప్రజలకు విస్తృతంగా వివరించేందుకు కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క సహా మొత్తం పన్నెండు మందితో ఏర్పడిన మంత్రివర్గం ఈ ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలు, ప్రజలకు అందించిన లబ్ధి తదితరాలను ప్రోగ్రెస్ రిపోర్టు తరహాలో ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నది. ఆయా శాఖలవారీగా మంత్రులు సాధించిన విజయాలను ముఖ్యమంత్రికి వచ్చే నెల చివరికల్లా అందించాలని భావిస్తున్నారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దడం, కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమలు చేసిన పథకాలు, వాటి ద్వారా సాధించిన ప్రగతితో పాటు రానున్న కాలంలో చేపట్టే ప్రోగ్రామ్‌ను ఈ రిపోర్టులో ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి స్వయంగా పురపాలక, విద్య, హోం శాఖలను కూడా నిర్వహిస్తున్నందున వాటికి సంబంధించిన ప్రగతి నివేదికను సైతం రూపొందించనున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో పథకాలు ఉనికిలోకి వచ్చినా వాటి అమలు అంతంతమాత్రంగానే ఉండడం, కొన్ని కాగితాలకు మాత్రమే పరిమితం కావడం, సంపూర్ణంగా అమలు కాకుండా అర్ధాంతరంగా ఆగిపోవడం, ప్రజాధనం దుర్వినియోగం, వాటిని చక్కదిద్దడానికి జరిగిన ప్రయత్నాలు... వీటిని మంత్రులు ఆ ప్రోగ్రెస్ రిపోర్టులో ప్రస్తావించనున్నారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మరోవైపు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆరు గ్యారంటీల మొదలు కొన్ని కొత్త పథకాలను అమలులోకి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలను కూడా ఈ రిపోర్టులో ప్రస్తావించనున్నారు. దాదాపు 42 శాఖలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహా పన్నెండు మందే మంత్రులు ఉండడంతో ఆయా శాఖలకు సంబంధించిన పనితీరు ఆ నివేదికల్లో వెల్లడి కానున్నది.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజావాణి, గల్ఫ్ కార్మికుల సంక్షేమం మొదలు సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీ, అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, గ్రూప్-1, 2, 3, 4 నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ రిలీజ్, నెల రోజుల వ్యవధిలోపే రుణమాఫీ అమలు, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్, ... వీటన్నింటినీ మంత్రులు వారివారి నివేదికల్లో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. దీనికి తోడు స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు, ధరణి స్థానంలో కొత్త ఆర్వోఆర్ (భూమాత పేరుతో) చట్టానికి ప్రయత్నాలు, మూసీ పునరుజ్జీవనం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమల స్థాపన.. ఇలాంటి అనేక అంశాలు ఈ నివేదికల్లో పొందుపర్చనున్నారు.

ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుంటామని, ప్రథమ వార్షికోత్సవం నాటికి ప్రోగ్రెస్ రిపోర్టును మంత్రులంతా రెడీ చేస్తారని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఆరు నెలల నాటికే ఈ ప్రక్రియ చేపట్టాలని తొలుత అనుకున్నా మే నెల వరకూ పార్లమెంటు ఎన్నికల హడావిడిలో మునిగిపోయినందున ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వార్షిక ప్రగతి నివేదిక తయారుచేసుకుని రివ్యూ చేసుకోవాలని వాయిదా వేసినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. పాత ప్రభుత్వ తప్పిదాలను సవరించుకుంటూ, ఫెయిల్యూర్స్ ను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తీసుకున్న చర్యలను, రానున్న రోజుల్లో ఏ దిశగా ప్రయాణించాలో ఈ నివేదికలో మంత్రులు స్పష్టత ఇవ్వనున్నారు. నిర్దిష్టంగా ఒక్కో స్కీమ్‌, మంత్రిత్వశాఖల వారీగా ఈ నివేదికలు రెడీ అవుతున్నందున గణాంకాలతో సహా అసెంబ్లీ వేదికగా లేదా ప్రోగ్రెస్ రిపోర్టు రూపంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఎవరికెన్ని మార్కులు అనే అంశంకంటే ప్రభుత్వం సాధించిన ఫలితాలను బాధ్యతగా వివరించాలన్నదే దీని ఉద్దేశం అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed