జీహెచ్ఎంసీకి కొత్త బాధ్యతలు.. అదనపు భారమేనా?

by Rani Yarlagadda |   ( Updated:2024-10-23 03:02:51.0  )
జీహెచ్ఎంసీకి కొత్త బాధ్యతలు.. అదనపు భారమేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీకే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని సర్కార్ యోచిస్తోంది. ఇది ఓఆర్ఆర్ పరిధి వరకు జీహెచ్ఎంసీ విస్తరించే ప్రణాళికలో భాగమేనని పలువురు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పీలకల్లోతు అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీకి ఓఆర్ఆర్ బాధ్యతలను అప్పగించడమంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టేనని పలువురు విమర్శిస్తున్నారు.

ఏడాదికి రూ.120 కోట్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో జీహెచ్ఎంసీ 2018లో చేసుకున్న ఒప్పందం విఫలమైంది. ఏడేండ్ల ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. ఈఈఎస్ఎల్ పనితీరు బాగాలేదని జీహెచ్ఎంసీ కమిషనర్లు అసంతృప్తి వ్యక్తంచేసిన సంఘటనలే అధికం. దీంతో మళ్లీ జీహెచ్ఎంసీనే చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో వీధి దీపాల నిర్వహణపై నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు చర్చించారు. అధికారులను నిలదీసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతోపాటు నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో అప్పటి కమిషనర్లు లోకేశ్ కుమార్, రోనాల్డ్ రోస్ హయాంలో ఈఈఎస్ఎల్‌కు ఫైన్లు వేయగా, ఈఈఎస్ఎల్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి కారణంగా అమ్రపాలి ఏకంగా రూ.70 కోట్ల బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. వరుసగా ముగ్గుర కమిషనర్ల హయాంలో పనితీరును మెరుగుపర్చుకోవాలన్న సూచనలు చేసినా, ఈఈఎస్ఎల్ పనితీరులో ఏమాత్రం మార్పు రాకపోవటంతో చర్యలను కఠినం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో కలిపి సుమారు 5.48 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు నెలకు సుమారు రూ.10 కోట్లు, ఏడాదికి రూ.120 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

అదనపు భారం..

గ్రేటర్‌లోనే వీధి దీపాల నిర్వహణలో ఆపసోపాలు పడుతున్న జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిని కూడా అప్పగించడం అదనపు భారమేనని పలువురు ఆర్ధికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 86,434 వీధిదీపాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 13,058 కనెక్షన్లు, 20 శివారు మున్సిపాలిటీల్లో 1,48,533 లైట్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 2,48,025 వీధి దీపాల నిర్వహణ బల్దియాకు భారంగా మారనుంది. జీహెచ్ఎంసీలోని వీది ధీపాలతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి స్థానిక సంస్థల్లోని వీధి దీపాల బాధ్యతలను కూడా జీహెచ్ఎంసీకే అప్పగించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో టెండర్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈఈఎస్ఎల్ సంస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను కొత్త టెండర్లకు వెళ్తారా? అనేది చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed