సమర్థవంతంగా పనరుల వినియోగం.. పూర్తిస్థాయి బడ్జెట్ దిశగా సన్నాహాలు!

by GSrikanth |
సమర్థవంతంగా పనరుల వినియోగం.. పూర్తిస్థాయి బడ్జెట్ దిశగా సన్నాహాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2024-మార్చి 2025) కొత్త బడ్జెట్ తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ప్రతిపాదనలను పంపించాలంటూ అన్ని శాఖలకూ రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అన్ని శాఖల్లోని విభాగాలు (హెచ్ఓడీ)లు అంచనాలను తయారుచేసి ఈ నెల 9వ తేదీకల్లా సంబంధిత డిపార్టుమెంట్ హెడ్‌కు పంపించనున్నారు. ఉన్నతాధికారులు వాటిని క్రోడీకరించి నిర్దిష్ట ఫార్మాట్‌లో ఈ నెల 11వ తేదీకల్లా పంపిస్తారు.

పక్కాగా లెక్కలు

గ్యారెంటీలు, కొత్త స్కీములు, పాత స్కీములకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచడం.. ఇలాంటి వాటి ద్వారా పడే భారాన్ని నిర్దిష్టంగా మెన్షన్ చేయాలని సూచించింది. ఇప్పటికింకా కొత్త లబ్ధిదారుల లెక్కలు తేలనందున అంచనాలను పంపించవచ్చిన సూచించింది. ఆన్-గోయింగ్ స్కీములకు ఆర్థిక సాయాన్ని పెంచనున్నందు లబ్ధిదారుల లెక్కలను పరిగణనలోకి తీసుకుని కొత్త బడ్జెట్‌లో అదనంగా ఎంత అవసరమవుతుందో స్పష్టత లభిస్తుందని పేర్కొన్నది. ఉద్యోగుల శాలరీలకు ఈ సారి ప్రత్యేక పద్దు కేటాయించాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిధులు వస్తున్నందున వాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్‌ను జోడించేలా ఏ స్కీమ్‌ను కూడా నిర్లక్ష్యం చేయవద్దని ఫైనాన్స్ డిపార్టుమెంటు పేర్కొన్నది.

సమర్థవంతంగా పనరుల వినియోగం

రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక చిక్కులను దృష్టిలో పెట్టుకుని పరిమిత వనరులను సమర్థవంతంగా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదాయం, ఖర్చు మధ్య వాస్తవిక అంచనాలను రూపొందించాలని, గత ప్రభుత్వంలో గందరగోళం చోటుచేసుకున్న తీరులో ఈసారి ఉండొద్దని ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నందున ఆ దిశగానే ఆయా డిపార్టుమెంట్ల అధికారులు బడ్జెట్ అవసరాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం శాంక్షన్డ్ పోస్టులు, పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలతో పాటు ప్రతి నెలా వారికి ఇస్తున్న వేతనాలు తదితరాలన్నింటినీ తెలియజేయాలని స్పష్టం చేసింది. ఏయే వివరాలు ఏ రూపంలో రావాలో నిర్దిష్టంగా పలు రకాల ఫార్మాట్‌లను అన్ని డిపార్టుమెంట్లు, హెచ్ఓడీలకు అందజేసింది. వేతనాలను నిర్దిష్ట పద్దు ద్వారా మాత్రమే చెల్లించాలని నొక్కిచెప్పింది.

కేంద్రం ఓటాన్ అకౌంట్

కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందున రాష్ట్రానికి గ్రాంట్లు ఏ స్థాయిలో వస్తాయో అంచనాకు అందనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఔటాన్ అకౌంట్‌నే పెట్టడం సహేతుకంగా ఉంటుందనే చర్చ మొదట్లో జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల విషయంలో ఒక అంచనా ఉన్నందున దానికి అనుగుణంగానే లెక్కలు వేసి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని దాదాపు నిర్ణయం తీసుకున్నందున అన్ని డిపార్టుమెంట్ల ఆఫీసర్లు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లలో అంచనాలు మారితే రివైజ్డ్ ఎస్టిమేట్స్ కేటిగిరీలో సర్దుబాటు చేసుకోవచ్చని సూచనలు వెళ్లినట్లు తెలిసింది. ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ ఫైనల్ అయ్యేలా ఎక్సర్‌సైజ్ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed