గల్ఫ్ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by M.Rajitha |
గల్ఫ్ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్(Gulf) కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతియేటా వేలమంది తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు పనులు నిమిత్తం వెళుతూ ఉంటారు. ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆయా దేశాల్లో కూలీ పనుల కోసం అక్కడికి చేరుకుంటారు. అనేక సందర్భాల్లో గల్ఫ్ అరబ్బుల చేతుల్లోనో, ఏజెంట్ల చేతుల్లోనో మోసపోయి.. ఇంటివద్ద చేసిన అప్పులు గుర్తు వచ్చి అక్కడ అష్టకష్టాలు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యం పాలయ్యి, ప్రమాదాల బారిన పడి మరణిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మృతుల కుటుంబాలను ఆదుకునే నాథుడే ఉండడు. ఇలాంటి కన్నీటి గాథలు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అరబ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది. అయితే బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్ , సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో మరణించిన తెలంగాణ కార్మిక కుటుంబాలకు మాత్రమే ఈ పరిహారం వర్తించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరణించిన కార్మికుల కుటుంబసభ్యులు ఆయా జిల్లాల కలెక్టర్లకు 6 నెలల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పరిహారంపై గల్ఫ్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం కాని దేశంలో మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటామని పలువురు గల్ఫ్ కార్మికులు పేర్కొన్నారు.

Advertisement

Next Story