శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి, సంగీత కార్యక్రమాలు

by M.Rajitha |
శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి, సంగీత కార్యక్రమాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన రవి ప్రభ, సుబ్రహ్మణ్యం, రామ‌చంద్ర, చంద్ర శేఖ‌ర్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల కాంచీపురానికి చెందిన చంద్రశేఖ‌ర ప‌ర‌మాచార్య యూనివ‌ర్శిటి కుల‌ప‌తి య‌మ్‌.య‌మ్‌.వెంప‌టి కుటుంబ శాస్త్రి "ఋగ్వేదం-ఉదాత్త భావ‌న‌లు" అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన క‌ళార‌త్న శ్రీ మోదుమూడి సుధాక‌ర్ బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

ఇక ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన సంప‌త్ కుమార్‌ బృందం "విష్ణు సహస్రనామ పారాయణం", ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుప‌తికి చెందిన కె.స‌ర‌స్వతి ప్రసాద్‌, కుమారి కోనేరు ల‌క్ష్మీ స్వరాజ్యంల బృదం భ‌క్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నెల్లూరుకు చెందిన కె.భ‌క్త‌వ‌త్స‌ల‌న్ "ముద‌లాళ్వారుల ప్రబంధాల‌లో శ్రీ‌వారు" అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన బుల్లెమ్మ బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన లెక్చర‌ర్ వేంక‌టేశ్వరులు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు.

Advertisement

Next Story