BSNL: బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై ఎంపీల అసంతృప్తి

by S Gopi |
BSNL: బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై ఎంపీల అసంతృప్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పనితీరుపై కొంతమంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అందించే సేవలు, తగ్గిపోతున్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య విషయంలో వారు నిరాశను తెలియజేస్తూ.. కొంతమంది ఎంపీలు తమ సొంత మొబైల్‌లోనే సమస్యలు ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ నేతృత్వంలోని అంచనాల కమిటీ సమావేశంలో దీని గురించి చర్చించారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ అధికారులకు ఎంపీలు వివరణ ఇచ్చారు. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ అగ్రస్థానం నుంచి 7 శాతం మార్కెట్ వాటాకు పడిపోయింది. యూజర్లు ప్రైవేట్ కంపెనీలకు మారుతున్నట్టు చెప్పారు. దీనికి బదులిచ్చిన అధికారులు రాబోయే ఆరు నెలల్లో మెరుగైన సేవలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వద్ద 24,000 టవర్లు ఉన్నాయి. కొత్తగా 54 వేల టవర్లు 4జీ టెక్నాలజీతో అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో దీన్ని పెంచుతూ దాదాపు లక్ష 4జీ మొబైల్ టవర్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆరు నెలల్లో ఫలితాలు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అధికారుల బృందం తరపున మాట్లాడిన టెలికాం సెక్రటరీ, బీఎస్ఎన్ఎల్ సీఎండీ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ.. సంస్థ పనితీరు మెరుగవుతోందని, ముఖ్యంగా 4జీ, 5జీ సేవలపై దృష్టి సారించామని, పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story