2008-డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్

by Mahesh |
2008-డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: 2008-డీఎస్సీ(2008-DSC) అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టుల స్థానాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. దీని కోసం 2008 డీఎస్సీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీస్‌లలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2008 డిసెంబర్‌ 6న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా నోటిఫికేషన్ విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో-28 ని తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో విచారణ జరిపిన కోర్టు కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్‌ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని నియామక కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్‌ మెరిట్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది.

ఈ సమయంలోనే డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. జూన్‌ 28న కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. జీవో-28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కొత్త మెరిట్‌ జాబితా విడుదల చేసిన ప్రభుత్వం 2010లో ఉద్యోగాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో మొదట మెరిట్‌ సాధించినప్పికి కూడా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3,500 మంది బీఈడీ అభ్యర్థులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో తెలంగాణకు చెందిన 1,200 మంది అభ్యర్థులు వరకు ఉన్నారు.

Next Story

Most Viewed