దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ దోస్తీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Mahesh |
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ దోస్తీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దోస్తీ కొనసాగిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ ను, స్పీకర్ వ్యవస్థను రాహుల్ అగౌరవ పరుస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరచడం, ఇండియన్ ఆర్మీ లాంటి సున్నితమైన వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తడం, దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేయడం, ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించడం, దేశ ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై ఆధారరహిత విమర్శలు చేయడం.. రాహుల్ గాంధీకి నిత్యకృత్యమైందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీపై రాహుల్ గాంధీ చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ప్రధాని మోడీకి ఆత్మవిశ్వాసం తగ్గిందని, తమ కారణంగానే అది జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మోడీపై 140 కోట్ల మంది ప్రజల విశ్వాసం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్.. గత మూడు ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్యను కలుపుకున్నా.. బీజేపీ గెలిచిన సీట్ల కంటే తక్కువేనని చురకలంటించారు. 2024 ఎన్నికల్లో వారి కూటమి మొత్తం కలిసి గెలిచిన సీట్ల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడుసార్లు డబుల్ డిజిట్ కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతూ.. అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ ఆత్మవిశ్వాసం తగ్గిందా, లేక మరింత దృఢమైందా అనే అంశంపై తమకు రాహుల్ సర్టిఫికెట్ అవసరం లేదని విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేకనే రాహుల్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 20 ఏండ్లుగా ప్రధాని పీఠంపై కూర్చోవాలని రాహుల్ పగటి కలలు కంటున్నారని, వరుసగా 3 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి, ఈర్షతో చతికిలపడి, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అర్హత పొంది.. ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed