Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మండలానికో విద్యాశాఖ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ

by Maddikunta Saikiran |
Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మండలానికో విద్యాశాఖ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ(Education Department)లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని(MEO) నియమించింది. 609 మండలాలకు ఇంచార్జీ ఎంఈవో(Incharge MEO)లను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయుల(Head Master)కు ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 632 మండలాలు(Mandals) ఉన్నాయి. కాగా అందులో 16 మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీచర్లకు బదిలీలు(Transfers), ప్రమోషన్ల(Promotions) ప్రక్రియ నిర్వహించింది. దీంతో ఇంచార్జీ ఎంఈవోలుగా ఉన్న చాలామంది ప్రధానోపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. విద్యాశాఖ బలోపేతం కోసం 609 మండలాలకు ఇంచార్జీ ఎంఈవోలతో పాటు, 16 మండలాలకు రెగ్యులర్ ఎంఈవోలకు బాధ్యతలు ఇచ్చారు. గతంలో ఒక్కో ఎంఈవోకు పలు మండలాలకు ఇంచార్జీ ఎంఈవోలుగా బాధ్యతలు ఇచ్చారు. ఇదిలా ఉండగా రెగ్యులర్ ఎంఈఓలకు 19 సంవత్సరాల తర్వాత బదిలీలు చేపట్టారు. కాగా, మరో ఏడు కొత్త మండలాలు ఐఎఫ్ఎంఐఎస్​ వెబ్ సైట్​లో అప్​డేట్ అవ్వకపోవడంతో ఆయా మండలాలకు ఎంఈవోల నియామకం పెండింగ్ లో పెట్టారు.

Next Story

Most Viewed