ప్రమోషన్ కోసం ప్రమాదానికి కుట్ర.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్

by vinod kumar |
ప్రమోషన్ కోసం ప్రమాదానికి కుట్ర.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రమోషన్ కోసం రైలు ప్రమాదానికి కుట్ర పన్నిన ముగ్గురు రైల్వే ఉద్యోగులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సూరత్‌లో ముగ్గురు రైల్వే ఉద్యోగులు ఈ నెల 21 తెల్లవారుజామున రైల్వే ట్రాక్‌పై ఫిష్ ప్లేట్, 71కీలు తొలగించి పక్కనే ఉన్న రైల్వే లైన్‌పై ఉంచారు. అనంతరం వారే రైలు పట్టాలు తప్పించేందుకు ఎవరో కుట్ర పన్నారని స్టేషన్ మాస్టర్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ట్రాక్ గుండా వెళుతున్న రెండు ప్యాసింజర్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ తర్వాత కాసేపట్లోనే ట్రాక్‌కు మరమ్మత్తులు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానం వచ్చి ముగ్గురు ఉద్యోగులైన సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లను విచారించారు. దీంతో వీరంతా నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. కేవలం ప్రమోషన్, సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడినట్టు వెల్లడించారు. సుభాష్ సూచనల ప్రకారం మనీష్ ఫిష్ ప్లేట్లను ట్రాక్ పై నుంచి తీసివేశారని తెలిపారు. ఈ ముగ్గురూ ట్రాక్ మరమ్మతుల బాధ్యతల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు చెప్పారు.

Next Story

Most Viewed