స్పీడ్ పెంచనున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఆ మంత్రం పనిచేస్తుందా?

by GSrikanth |   ( Updated:2023-05-14 03:31:41.0  )
స్పీడ్ పెంచనున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఆ మంత్రం పనిచేస్తుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కర్నాటకలో భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది అధికారంలో ఉన్న మంత్రులు, నేతలు, పార్టీపైన ఉన్న వ్యతిరేకతే అనే నిర్ధారణకు వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగం, అవినీతి, కమిషన్లు తదితరాలను కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసింది. వాటికి తగినట్లుగానే మేనిఫెస్టోలో పలు హామీలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ అవే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నది. రాష్ట్ర ప్రజల్లో వివిధ అంశాల్లో ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా ఉన్న వ్యతిరేకతను ఎజెండాగా తీసుకోవాలనుకుంటున్నది. బీజేపీ సైతం ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నది. అందులో భాగమే ఇటీవల నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లాంటి కార్యక్రమాలు.

కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ గతేడాది రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్ రైతులు, వ్యవసాయంపైన ఫోకస్ పెట్టింది. ఇటీవల ప్రియాంకగాంధీ సమక్షంలో రిలీజ్ చేసిన డిక్లరేషన్ యూత్‌పైన ఫోకస్ పెట్టింది. ఈ రెండూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అనుగుణంగా డిక్లరేషన్‌లలో హామీలు ఇచ్చాయి. ఇంకా ఏడు డిక్లరేషన్‌లను ప్రకటించడానికి ప్రణాళిక వేసుకున్నది. కర్ణాటకలో వచ్చిన తాజా విజయంతో ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా జనంలో ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నది. కర్ణాటకలో పనిచేసిన ఫార్ములా ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందనే ధీమా కాంగ్రెస్ నేతల్లో ఏర్పడింది. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదనే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్‌ను బీఆర్ఎస్‌పైనే పెడుతున్నది. తొమ్మిదేళ్ల వైఫల్యాలు, హామీ ఇచ్చినా అమలుకాని స్కీమ్‌ల చిట్టాను సేకరిస్తున్నది.

భారత్ జోడో యాత్ర ఎఫెక్టు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడంతో తెలంగాణలోనూ దాన్ని అనుకూలంగా మల్చుకునే ఆలోచన చేస్తున్నది. సోనియాగాంధీ మొదలు పార్టీ అగ్ర నాయకత్వమంతా కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేసినట్లుగానే తెలంగాణలోనూ జాతీయ నాయకులను తిప్పడం ద్వారా ఫలితం ఉంటుందని భావిస్తున్నది. మొత్తం ఫోకస్‌ను కర్ణాటక మీద కేంద్రీకరించినందున ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భావించారు. తెలంగాణ విషయంలోనూ డిసెంబరులో ఎన్నికలు జరిగేటప్పుడు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యతను తెలంగాణకూ ఇవ్వాలని అగ్ర నాయకత్వాన్ని రాష్ట్ర పీసీసీ కోరనున్నది. తెలంగాణలో విజయానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నందున రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేయనున్నది.

కర్ణాటకలో బీజేపీ సత్తా ఏంటో తెలిసిపోయిందని, ఇక తెలంగాణలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్‌ను మాత్రమే లెక్కలోకి తీసుకుని ఆ పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి, వైఫల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తదితరాలే ప్రధానంగా ఉండేలా కార్యాచరణను రూపొందించుకోవాలనుకుంటున్నది. హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల్లో మరింత దృష్టి పెట్టి, అవసరాన్ని బట్టి కర్ణాటక నేతలను సైతం రప్పించే అవకాశమున్నది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా వైఫల్యాలను తెరపైకి తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యూత్ తదితర సెక్షన్ల ప్రజలకు చేరువ కావాలన్నది కాంగ్రెస్ ప్లాన్.

Read more:

హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధం.. కాషాయమయం కానున్న కరీంనగర్

Advertisement

Next Story

Most Viewed