'సెల్యూట్ తెలంగాణ'.. బేగంపేటలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఘన స్వాగతం

by Prasad Jukanti |
సెల్యూట్ తెలంగాణ.. బేగంపేటలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఘన స్వాగతం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో బీజేపీని అన్ని వర్గాలు ఆదరించాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని 35 శాతానికి పెంచి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ తెలంగాణ తరఫున సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఇవాళ రాష్ట్రానికి వచ్చిన కిషన్‌రెడ్డికి బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మహిళా నేతలు ఆయనకు హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఇటీవల ఎన్నికైన ఎంపీలు, బీజేపీ ముఖ్య నేతలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు.

స్టేట్ ఆఫీస్‌లో సన్మానం...

ఈ సందర్భంగా దారిపొడవునా ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రసూల్‌పుర, ప్యారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగనున్నది. ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్‌లో కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అనంతరం వారు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.



Next Story