ఇళ్లపై నల్లజెండాలు.. కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-08 00:16:01.0  )
ఇళ్లపై నల్లజెండాలు.. కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్షేత్రస్థాయిలో కేంద్రం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు పార్టీ సన్నద్ధమైంది. ప్రతి ఇంటిపై నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలియజేసేందుకు ఇప్పటికే పార్టీ గ్రామాలకు జెండాలను పంపిణీ చేసింది. విజయవంతం చేసే బాధ్యతను ఆయా గ్రామ కమిటీలకు అప్పగించింది. మోడీ దిష్టిబొమ్మలను సైతం దహనం చేసే కార్యక్రమం చేపట్టాలని పిలుపు నిచ్చింది. నిరసనల్లో గ్రామంలోని రైతులందరినీ భాగస్వామ్యం చేసేలా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.

రైతులను నిరసనల్లో భాగస్వామ్యం చేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసేలా కార్యచరణ చేపట్టింది. అందుకు సంబంధించిన బాధ్యతలను గ్రామకమిటీలకు చేపట్టింది. గురువారం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నల్లజెండాలను పంపిణీ చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని 12769 గ్రామపంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపు నిచ్చింది. అందులో భాగంగా ఉదయం 9 గంటలకు గ్రామ కూడలికి పార్టీ శ్రేణులు చేరుకొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామంలోని అన్ని వీధుల్లో ఊరేగింపు చేస్తారు. అనంతరం గ్రామ కూడలిలో దహనం చేస్తారు. ప్రతి కార్యకర్త , రైతు ఇంటిపై నల్లజెండాను ఎగురవేయడం జరుగుతుంది. అందుకు సంబంధించిన బాధ్యతలను టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖతో పాటు సర్పంచ్, ఎంపీటీసీలకు అప్పగించింది. అదే విధంగా పార్టీ అనుబంధ సంఘాల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా గ్రామంలోని రైతులందరిని నిరసనలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వివరించడంతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన మీడియోలను సైతం ప్రజలకు వివరించేలా సన్నద్ధమయ్యారు. అవసరం అయితే ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి వివరించేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు చేపట్టే కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, మండలపార్టీ అధ్యక్షులు సైతం పర్యవేక్షించనున్నారు. వర్చువల్ పద్దతిలో పర్యవేక్షించడంతో పాటు పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అవసరం అయితే గ్రామస్థులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను సైతం ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ బీజేపీ విధానాలను గ్రామస్థాయి నుంచి ఎండగట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తిప్పికొడుతూ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ మరింత దగ్గరయ్యేందుకు అన్ని చర్యలు చేపట్టింది.

Advertisement

Next Story

Most Viewed