Venkateshwar Reddy: తెలంగాణ క్రికెట్‌ అభివృద్ధికి సహకరించాలి

by Gantepaka Srikanth |
Venkateshwar Reddy: తెలంగాణ క్రికెట్‌ అభివృద్ధికి సహకరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్దికి అందరూ సహకరించాలని, గ్రామీణ క్రికెటర్లకు సైతం జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘానికి (టీడీసీఏ) బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమెరికా క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ పీసీకే వేణు రెడ్డిని శాట్ చైర్మన్‌ శివసేనా రెడ్డితో కలిసి టీడీసీఏ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా టీడీసీఏ 2025 క్యాలెండర్‌, అండర్‌-16 టోర్నమెంట్‌ ట్రోఫీలను ఆవిష్కరించారు. అనంతరం శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ అగ్రరాజ్యం అమెరికా క్రికెట్‌ బోర్డు చైర్మన్‌గా ఎదగటం గర్వించగదగిన విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ది కోసం టీడీసీఏ కష్టపడుతోందని వివరించారు.

ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని శివసేనా రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ పీసీకే వేణు మాట్లాడుతూ.. అమెరికాలో క్రికెట్‌ను ఐసీసీ గత ఐదారేండ్లలోనే గుర్తించిందని, అంతకుముందు, స్వచ్ఛందంగానే ఆట కోసం పనిచేసినట్లు చెప్పారు. తాను చైర్మన్‌గా ఉన్న సమయంలోనే అమెరికా జట్టు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వటం, రానున్న ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించటం సంతృప్తినిచ్చిందన్నారు. తెలంగాణలో గ్రామీణ క్రికెట్‌ పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జేఎఫ్‌ చైర్మన్‌ రామిరెడ్డి, పెటా రాష్ట్ర అధ్యక్షుడు బీ రాఘవరెడ్డి, సురేందర్‌ రెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి ముజీబ్‌, సినీ నటుడు శ్రీధర్‌, ప్రవాస తెలంగాణ వాసులు, తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) జిల్లా కన్వీనర్లు, క్రికెటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story