Dating scams : డేటింగ్.. చీటింగ్ !

by Javid Pasha |
Dating scams : డేటింగ్.. చీటింగ్ !
X

దిశ, ఫీచర్స్ : తరచుగా డేటింగ్ యాప్‌లలో చాటింగ్ చేస్తూ మహిళలకు వల వేయడమే అతని పని. ముఖ్యంగా 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్కులే అతని టార్గెట్. అందుకోసం బంబుల్, స్నాప్ చాట్‌ సహా పలు డేటింగ్ యాప్‌లలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. తాను అమెరికాకు చెందిన మోడల్‌‌నంటూ పరిచయాలు పెంచుకున్నాడు. అందమైన మెసేజ్‌లతో, మాటలతో ఆకట్టుకున్నాడు. ఒకరా ఇద్దరా దాదాపు 700 మందిని లైన్‌లో పెట్టిన ఢిల్లీకి చెందిన తుషార్ బిస్ట్ (23) చేసిన ఘనకార్యమిది. పలువురు డేటింగ్ యాప్‌లో పలువురు మహిళల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే, చెప్పినట్లు వినకపోతే ట్రోల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. చివరికి పాపం పండింది. బాధితుల్లో కొందరి ఫిర్యాదుతో జనవరి 4, శనివారం నాడు ఢిల్లీ సైబర్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

పైన పేర్కొన్న సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మన దేశంలో, రాష్ట్రంలో, చివరికి హైదరాబాద్‌లో కూడా డేటింగ్ యాప్‌లు, సైట్లలో మోసాలు పెరగిపోతున్నాయి. తరచుగా వాటిలో నిమగ్నం అవడం యువతీ యువకుల్లో ఓ వ్యసనంగా మారుతోంది. ఇదే అదునుగా మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చీటింగ్ చేసే వ్యక్తులు అమ్మాయిలైతే అబ్బాయిలకు, అబ్బాయిలైతే అమ్మాయిలకు వలపుల వల విసురుతారు. మాటల్లో దించుతారు. అవతలి వ్యక్తి బలహీతనలన్నీ తెలుసుకుంటారు. చివరికి కలుద్దామని చెప్పి, అవసరాల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు కొందరైతే, ఫేక్ అకౌంట్ల పేరుతో అవతలి వ్యక్తి ఫొటోలు, వీడియోలు సేకరించి, అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారు ఇంకొందరు. భావోద్వేగాలతో ఆడుకునే వారు మరికొందరు. ఇలా మోసగాళ్ల చేతిలో నలిగిపోతూ బయటకు చెప్పుకోలేక లోలోనే మథన పడుతున్న వారు చాలా మందే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కొందరు ధైర్యం చేసి ఎదిరించడమో, పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేస్తుంటే, మరికొందరు పరువు పోతుందనే ఉద్దేశంతో మోసగాళ్లు అడిగింది ఇచ్చేసి గమ్మునుంటున్నారు. తెలిసింది కదా ఇకనైనా అలర్ట్ గా ఉండండి!

కలుద్దామని చెప్పి..

అది 2024, జనవరి 28.. ఢిల్లీలో నివాసం ఉంటూ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి డేటింగ్ యాప్‌లో అమ్మాయి పరిచయమైంది. మాటా మాటా కలిపింది. వలపు వల విసిరింది. ఇంకేముంది మనోడు పడిపోయాడు. ‘నిను చూడక నేనుండలేను.. ఎప్పుడు కలుద్దాం’’ అన్నాడు. ‘నా బర్త్ డే ఉంది డార్లింగ్ ఇక్కడే.. మన ఢిల్లీలోని వికాస్ మార్గ్‌లో ఉన్న బ్లాక్ మిర్రర్ కేఫ్‌కు రా కలుద్దాం’ అంటూ సమాధానం. ఎగిరి గంతేశాడు ఆ యువకుడు.. టిప్ టాప్‌గా రెడీ అయ్యి అక్కడికి వెళ్లాడు. అమ్మాయితో కలిసి కేఫ్‌లో కూర్చొని 4 కూల్ డ్రింక్స్, రెండు స్నాక్స్, రెండు కేకులు ఆర్డర్ వేశాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు.. చాలా అర్జంట్ డార్లింగ్ నేను త్వరగా ఇంటికెళ్లాలి. మళ్లీ రేపు కలుద్దామంటూ వెళ్లిపోయిందా అమ్మాయి.

ఆ తర్వాత జరిగింది తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యాడు సదరు యువకుడు. ఏం జరిగిదంటే.. అతను ఆర్డర్ చేసిన స్నాక్స్‌కు ధర కనీసం వెయ్యి కూడా దాటదు. కానీ రూ. 1.2 లక్షల బిల్లు చేతిలో పెట్టారు కేఫ్ నిర్వాహకులు. ఇదేంటి ఇంత బిల్లు? అంటే.. అదంతే మీతో పాటు వచ్చిన అమ్మాయి చెప్పింది. పెడింగ్ బిల్లులు చాలా ఉన్నాయని సమాధానం ఇచ్చారు. దీంతో అతను వారితో గొడవకు దిగాడు. కానీ కేఫ్ యాజమాన్యం నోటికొచ్చినట్లు మాట్లాడి అతన్ని నిర్భందించింది. బిల్లు కట్టకపోతే వదిలేది లేదని చెప్పడంతో తప్పని పరిస్థితిలో బిల్లు చెల్లించిన యువకుడు తర్వాత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఆ అమ్మాయి, కేఫ్ నిర్వాహకులతో కలిసి యువతను చీట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముక్కూ మొహం తెలియకముందే.. కేవలం ఆన్ లైన్‌లో పరిచయంతోనే అవతలి వ్యక్తి తమ సొంతమని ఫిక్స్ అయితే ఇలాంటి మోసాలు జరగొచ్చు జాగ్రత్త!

అమ్మాయిలే టార్గెట్

బెంగుళూరులోని బ్రూక్ ఫీల్డ్ ఏరియాకు చెందిన యువకుడు రిద్ బేడీది మోసం చేయడంలో మరో రకమైన స్టైల్. ఒకప్పుడు అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసేవాడు. కొంతకాలం తర్వాత బిహేవియర్ సరిగ్గా లేదని ఉద్యోగం నుంచి ఊడ బీకారు. ఆ తర్వాత తిరిగి బెంగుళూరికి వచ్చిన అతను ఓ ప్రైవేట్ సంస్థలో ప్రొడక్ట్ డిజైనర్‌గా చేరాడు. అయినా బుద్ధి మారలేదు. విలాసాలకు అలవాటు పడిన అతను డేటింగ్ వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అందమైన అమ్మాయిల అర్ధనగ్న ఫొటోలను సేకరించి, మార్ఫింగ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతూ డబ్బులు గుంజడం స్టార్ట్ చేశాడు. ఇలా ఎంతోమంది యువతులను మోసం చేశాడు. ఎంత కాలం నడుస్తుంది? చివరికి బండారం బయటపడింది. అందుకే అమ్మాయిలూ జర జాగ్రత్త.. డేటింగ్ యాప్‌లలో, సోషల్ మీడియాలో అవతలి వ్యక్తి అడగ్గానే ఫొటోలు, వివరాలుషేర్ చేయకండి. బీ కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు.

మీ బలహీనతే వారికి లాభం

ఇది నిజం.. జనాల బలహీనతే మోసగాళ్లకు వరం. వారు దానిని ఎలా యూజ్ చేసుకుంటారనడానికి హైదరాబాద్‌లో గతేడాది జనవరిలో జరిగిన మరో సంఘటనే ఉదారణ. గిఫ్టుల పేరుతో, బ్యాంకు ఓటీపీల పేరుతో కొందరు మోసం చేస్తుంటే.. మరికొందరు అమ్మాయిలను ఎరవేస్తూ.. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ మోసం చేస్తున్నారు. సిటీలో అదే జరిగింది. టిండర్ అనే డేటింగ్ యాప్‌లో కొందరు మహిళలు యువకులను టార్గెట్ చేశారు. వారితో పరిచయం పెంచుకొని పబ్బులకు, క్లబ్బులకు తిప్పుతూ మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్నారు. నగరంలోని మోష్ పబ్ యాజమాన్యం అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు తెరవెనుక ఉండి ఇదంతా నడిపించినట్లు ఆ తర్వాత తెలిసింది. అంటే నిర్వాహకులు డబ్బున్న యువకులకు కొందరు అమ్మాయిలను ఎరగా వేసి వారి ద్వారా పబ్‌కి గిరాకీ పెంచుకొని, ఎక్కువమొత్తంలో బిల్లులు వేస్తూ యువత భావోద్వేగాలతో, బలహీనతలతో సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా డేటింగ్ పేరుతో చీటింగ్ చేసేవారు సోషల్ మీడియాలో కూడా ఉన్నారు.. జర జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటున్నారు నిపుణులు.

పెరుగుతున్న మోసాలు

ఒకప్పుడు పరిచయమున్న వ్యక్తులతోనే ఎక్కువగా మాట్లాడటం, నమ్మడం వంటివి చేసేవారు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. డేటింగ్ యాప్‌లో, సైట్‌లలో ప్రొఫైల్ క్రియేట్ చేస్తే చాలు. ఛాటింగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. నేరుగా కాకపోయినా జస్ట్ ఫొటోలు, ప్రొఫైల్స్ చూసి అవతలి వ్యక్తులను నమ్మేస్తున్నారు చాలా మంది. దీంతో కొందరు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అవతలి వ్యక్తులను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తున్నారు. టీచింగ్.. డేటింగ్.. ఇలా ఏదైతేనేం తమ గోల్ సాధిస్తున్నారు. డేటింగ్ కల్చర్ విస్తరించాక ఇండియాలో ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఐదారేండ్ల కిందట 20 మిలియన్ల మంది భారతీయులు మాత్రమే డేటింగ్ యాప్‌లను వినియోగించగా ఇప్పుడది రెట్టింపయ్యింది. నేరస్థులు కూడా పక్కా స్కెచ్‌‌తోనే మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు యువతను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. ఏదో ఒక రూపంలో కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొందరిలో అయితే అసలు మార్పు రావడం లేదు. మోసపోతున్న వారు కూడా కొందరు తమ పరువు పోతుందని బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్‌లలో చీటింగ్‌లు, బ్లాక్ మెయిల్‌లు ఇటీవల పెరుగుతున్నాయి. అందుకే బీ కేర్‌ఫుల్! అంటున్నారు నిపుణులు.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం బెటర్

* డేటింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సాంకేతిక నిపుణులు. ముఖ్యంగా మీ ఆసక్తి ఏదైనా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త. అవతలి వ్యక్తి మాటలకు, అందమైన మెసేజ్‌లకు, పొగడ్తలకు పడిపోయి వెంటనే వివరాలు పంచుకోవద్దు. ఆన్‌లైన్ స్నేహాలకంటే నేరుగా పరిచయస్తులే నిజమైన స్నేహితులని గుర్తుంచుకోండి. ఎన్నడూ ముఖ పరిచయంలేని వ్యక్తి ఆన్‌లైన్‌లో హాయ్ చెప్పగానే పొంగిపోవద్దు. మీరంటే ఇష్టమంటూ.. స్నేహం చేస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు, చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఎకౌంట్లలో మీరు పెట్టే పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోలు, వీడియోల ఆధారంగా సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని చీటింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీదీ పంచుకోవడం అవసరమా? అనేది కూడా ఆలోచించాలి.

* సోషల్ మీడియా వేదికల్లో మీ ప్రొఫైల్ ఫొటోలు, వీడియోలు కేవలం నమ్మకమైన స్నేహితులకే కనిపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మోసం చేయాలనుకున్న వారికి మీ వివరాలు అందే అవకాశం ఉండదు. అలాగే అందమైన యువతుల ఫొటోలతో కొందరు సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఎవరైనా డేటింగ్ యాప్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. యాక్సెప్ట్ చేసినా అవతలి వ్యక్తిని వెంటనే నమ్మకండి అంటున్నారు నిపుణులు.

* మీరు వాడే మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు కూడా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను, సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం బెటర్. దీంతో డేటింగ్ యాప్‌లలో సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్ నుంచి సేఫ్‌గా ఉండవచ్చు. అట్లనే ఎవరైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫొటోలు అడిగితే అస్సలు ఇవ్వకండి. డేటింగ్ యాప్‌లో పరిచయం అయినప్పటికీ అవతలి వ్యక్తిని ఒకసారి నేరుగా కలిసి నిర్ధారించుకునే వరకు పర్సనల్ వివరాలను షేర్ చేయకూడదు. ఇక ఆన్‌లైన్‌లో డేటింగ్ పేరుతో, ప్రేమ పేరుతో కథలు చెప్పే వారిని వెంటనే నమ్మకుండా ప్రశ్నించడం మొదలు పెట్టండి. మోసగాళ్లు అయితే వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది. దీంతో మీరు అలర్ట్ అవ్వొచ్చు.

Advertisement

Next Story

Most Viewed