రెండు రాష్ట్రాల్లో ట్యాపింగ్ టెన్షన్! అసలు ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు?

by Rajesh |   ( Updated:2023-02-04 07:21:48.0  )
రెండు రాష్ట్రాల్లో ట్యాపింగ్ టెన్షన్! అసలు ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ప్రతిపక్ష నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బీఆర్ఎస్ సర్కారుపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైతం తన ఫోన్ ట్యాప్ అవుతోందిన ఆరోపించడం సంచలనంగా మారింది. తాజాగా ఏపీ అధికార పార్టీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం జగన్ సర్కారుపై ఫోన్ ట్యాప్ అవుతోందని ఫైర్ అయ్యారు.

ట్యాపింగ్ వ్యహహారాన్ని ప్రభుత్వంలోని ఉన్నతాధికారే తనకు తెలిపాడని సంచలన విషయాలు వెల్లడించారు. సదరు ఉన్నతాధికారి తాను మాట్లాడిన ఆడియో సంభాషణలు సైతం తనకు పంపారని పేర్కొన్నారు. దీంతో అన్ని పార్టీల్లో ట్యాపింగ్ అంశం టెన్షన్ పెడుతోంది. ఎవరు తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారో అని నేతలంతా భయపడుతున్నారు. ఇద్దరు సీఎంలు తమపై నిఘా ఉంచారని రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. గీత దాటితే అధినేత వేటు వేస్తారని.. తమ ఫోన్లు ట్యాప్ అయితే తమకు సమస్యే అని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు ఈ ట్యాపింగ్ అంశం వణుకు పుట్టిస్తోంది.

ట్యాపింగ్ ఎలా?

టెలిఫోన్, ఇంటర్నెట్ ఆధారిత సంభాషణలను రహస్య మార్గాల ద్వారా పర్యవేక్షించడాన్ని ట్యాపింగ్ అంటారు. ఏ ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంభాషణలు గోప్యంగా విన్నా.. లేదా రికార్డు చేసినా దాన్ని ట్యాపింగ్‌గా పేర్కొంటారు. ఫోన్ ట్యాపింగ్‌నే వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఏజెన్సీలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ ట్యాపింగ్ చేస్తుంటాయి. కాగా ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశాలతో సత్సంబంధాల నిర్వహణతో పాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్‌ను ఇంటర్‌సెప్ట్ చేయవచ్చు. ఇందుకు చట్టాలకు లోబడి, ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు సర్వీస్ ప్రొవైడర్లు అవకాశాన్ని కల్పిస్తాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు ట్యాపింగ్ చేసేందుకు అధికారం ఉంటుంది.

చట్టాలేం చెబుతున్నాయి..

భారతదేశంలో భారత టెలిగ్రాఫ్ (సవరణ) రూల్స్, 2007లోని రూల్ 419Aతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం అధీకృత చట్ట అమలు సంస్థల ద్వారా కమ్యూనికేషన్‌ను చట్టబద్ధంగా అడ్డుకోవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం దేశసమగ్రత, సార్వభౌమత్వం, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రాలు, కేంద్రం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది.

దీన్ని నియంత్రించడానికి టెలిగ్రాఫ్ చట్టంలోని 26(బీ) సెక్షన్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. టెలీకమ్యూనికేషన్స్ టెక్నాలజీని చట్టబద్ధంగా అడ్డుకోవడం మరియు పర్యవేక్షించే ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ప్రభుత్వం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ (CMS)ని ఏర్పాటు చేసింది. పౌరుల గోప్యతను జాగ్రత్తగా చూసుకోవడానికి, చట్టబద్ధమైన పర్యవేక్షణను భారతీయ టెలిగ్రాఫ్ రూల్స్ యొక్క సెక్షన్ 5(2) ద్వారా నిర్వహిస్తున్నారు.

ఇందులో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్ కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమీక్షా కమిటీ రూపంలో పర్యవేక్షణ యంత్రాంగం ఉంటుంది. పెగాసెస్ అనే ఇజ్రాయిల్ స్పై వేర్‌తో దేశంలోని మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ పెగాసస్‌ను చంద్రబాబు హాయాంలో వినియోగించి ట్యాపింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీలోని జగన్ సర్కారు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. కాగా ఈ ట్యాపింగ్ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి..

Advertisement

Next Story

Most Viewed