ఇదేనా వారు ఇచ్చే మర్యాద? తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్

by Sathputhe Rajesh |
ఇదేనా వారు ఇచ్చే మర్యాద? తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌కు ఎక్కడ మర్యాద ఇచ్చారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే ఉగాది వేడుకలకు ఆహ్వానించినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మహిళా గవర్నర్ అనే అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రొటోకాల్ వివాదంతో పాటు పలు అంశాలను అమిత్ షాకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తానెప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తున్నానని, తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమేనని గవర్నర్ పేర్కొన్నారు . తెలంగాణలో గవర్నర్‌ ప్రయాణించాలంటే రోడ్డుమార్గమే దిక్కని, గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. తాను ఏమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? బీజేపీ కార్యకర్తలను వెంటేసుకొని యాదాద్రికి వెళ్లానా? అని ప్రశ్నించారు.

సీఎస్ వచ్చి సమస్య ఏంటో తనతో మాట్లాడాలని తమిళిసై అన్నారు. తనను బీజేపీ కార్యకర్త అని ఎలా అంటారని తమిళి సై ప్రశ్నించారు. తాను అన్నిపార్టీల నేతలను కలిశానని, ఏదైనా ఉంటే.. అడిగితే.. సమాధానం చెబుతానన్నారు. గణతంత్ర, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఇదేనా వారు ఇచ్చే మర్యాద?.. సీఎం కేసీఆర్ సహా అందరినీ ఆహ్వానించానని.. ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. ఇది తమిళిసై సమస్య కాదని.. గవర్నర్ ఆఫీస్‌కు జరుగుతున్న అవమానమని అన్నారు. ఈ నెల 11వ తేదీన భద్రాచలంకు రోడ్డు మార్గంలోనే వెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పరిస్థితి ఎలా ఉందో ములుగు పర్యటన, యాదాద్రి పర్యటనను చూసి అర్థం చేసుకోవచ్చన్నారు. గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు. మేడారానికి రోడ్డు మార్గం ద్వారానే వెళ్లానని, భద్రాద్రి కూడా రోడ్డు మార్గం ద్వారానే వెళతానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed