- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashant Kishor | KCR: ప్రగతిభవన్‌లో ఏం జరిగింది? పీకే, కేసీఆర్ భేటీ మతలబేంటి?
Prashant Kishor | KCR
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా హైదరాబాద్ ఎందుకొచ్చారు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆదివారం మధ్యాహ్నం సుదీర్ఘ మంతనాలు జరపడం వెనక మతలబేంటి? ఐ-ప్యాక్ తరఫున టీఆర్ఎస్‌కు పనిచేయడం ఈ భేటీ ఉద్దేశమా? లేక బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కాంగ్రెస్‌కు దగ్గర చేయడానికి ఆ పార్టీ తరఫున దూతగా వచ్చారా? ఎవరి అవసరం ఎవరికున్నది? కేసీఆర్‌ను కన్విన్స్ చేయడానికా..? లేక సూచనలు ఇవ్వడానికి పీకే ప్రయత్నిస్తున్నారా? పీకే సహకారాన్ని తీసుకోడానికి కేసీఆర్ తహతహలాడుతున్నారా? ఏక కాలంలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్‌కు సమదూరం పాటించడం పీకేకు సాధ్యమేనా? రెండు పడవల మీద ప్రయాణం ఆశించిన ఫలితాలను ఇస్తుందా? ఇవీ ఇప్పుడు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా ఐ-ప్యాక్ తరఫున టీఆర్ఎస్‌కు సేవలు కంటిన్యూ అవుతాయని పీకే తాజా భేటీ సందర్భంగా కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ధ్రువీకరించే తీరులో కేటీఆర్ కొద్దిమంది మీడియా ప్రతినిధులతో కామెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ టీఆర్ఎస్‌కు పనిచేస్తుందని, ఆ సంస్థతో పీకేకు సంబంధాలు తెగిపోతాయని, ఐ-ప్యాక్ సంస్థతో డీల్ యధాతథంగా కొనసాగుతుందని కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దీంతో పీకే కాంగ్రెస్ సభ్యుడైనా ఆయన నుంచి పరోక్షంగా టీఆర్ఎస్‌కు సేవలు అందుతాయనేది దాదాపు ఖరారైపోయింది. అయితే కాంగ్రెస్‌లో పీకే చేరిపోయిన తర్వాత ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ పరిస్థితి ఏమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
టార్గెట్ బీజేపీ
ప్రగతి భవన్‌లో కేసీఆర్, పీకే మధ్య జరిగిన లంచ్ మీటింగ్ సందర్భంగా జాతీయ రాజకీయాల పైన కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. బీజేపీని ఢీకొట్టడంపైనా ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారం. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ పీపుల్స్ ఫ్రంట్ రూపంలో పోషించనున్న పాత్రపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అలాంటి కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను సైతం కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలిసింది. బీజేపీ వ్యతిరేకశక్తులన్నీ ఏకమైనప్పుడే ఆ పార్టీని గద్దె దింపడం, ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని కేసీఆర్‌కు పీకే నొక్కిచెప్పినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పీకే పరోక్షంగా సహకారం ఇవ్వడంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. కేటీఆర్ వ్యాఖ్యల్లోనూ ఇదే స్పష్టమవుతున్నది.
చర్చల సారాంశం గోప్యం!
ప్రగతి భవన్‌లో పీకే, కేసీఆర్ మధ్య జరిగిన సమావేశం సరికొత్త సందేహాలకు ఆస్కారం కల్పించింది. కాంగ్రెస్‌తో కలిసి రావాల్సిందిగా కేసీఆర్‌ను పీకే కోరారా? ఆ దిశగా సూచనలు చేశారా? లేక టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కేసీఆరే బలంగా కోరారా? ఇలాంటి అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. భేటీ అయిన ఇరువురూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం గోప్యంగానే ఉండిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సహకరిస్తే.. లోక్‌సభ ఎన్నికలకు టీఆర్ఎస్ సహకరిస్తుందనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. రెండు నెలలుగా కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్న ప్రక్రియకు కొనసాగింపుగానే ఇప్పుడు పీకే ప్రగతి భవన్‌లో సీఎంతో భేటీ అయ్యారా? లేక కాంగ్రెస్ పార్టీ పంపిన ప్రతినిధిగా వచ్చారా? అనే అనుమానాలూ లేకపోలేదు.
పొత్తు పొడిచేనా..?
ఒకవైపు టీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదంటూ గత నెలలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సోనియాగాంధీ సమక్షంలో పీకే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగానూ పొత్తులతో సంబంధం లేకుంటా ఒంటరిగా పోటీ చేసి 370 స్థానాలు గెలవడంపై రూట్‌మ్యాప్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలంతా ఒంటరి పోరే అంటూ నొక్కి చెప్తున్నా ఇప్పుడు రెండు పార్టీలకు చెందిన కేసీఆర్, పీకేలు చర్చలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చలకు దారితీసింది.
ఏక కాలంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తో సంబంధాలను కొనసాగిస్తున్న పీకే వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలో పడేసినట్లయింది. లాంఛనంగా పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన సమయంలో కేసీఆర్‌తో మంతనాలు జరపడం వెనక కాంగ్రెస్ ప్రమేయం ఉన్నదేమోననే అనుమానాలూ తలెత్తుతున్నాయి. కేసీఆర్‌పైనా, టీఆర్ఎస్‌పైనా ఒంటికాలిమీద ఫైర్ అవుతున్న రేవంత్ తాజా భేటీతో డైలమాలో పడినట్లయింది. మే నెల మొదటివారంలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా రెండు పార్టీల వైఖరిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. పీకే పరోక్షంగా టీఆర్ఎస్‌కు ఎలాంటి సహకారం ఇస్తారు, ఆయనకు చెందిన ఐ-ప్యాక్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీలో పీకే రోల్ ఏంటి, ఏ పార్టీకి ఎవరితో ఎలాంటి డీల్ కుదురుతుంది... ఇవన్నీ తొందర్లోనే తేలిపోనున్నాయి.