స్టేట్ చీఫ్ నియామకంపై సస్పెన్స్.. ఈ నెలాఖరులోగా T-బీజేపీకి కొత్త అధ్యక్షుడు!

by Rajesh |   ( Updated:2024-07-12 00:00:35.0  )
స్టేట్ చీఫ్ నియామకంపై సస్పెన్స్.. ఈ నెలాఖరులోగా T-బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్ష నియామకంపై కసరత్తు మొదలైంది. ఢిల్లీలో జాతీయ నాయకత్వం ఎంపిక ప్రక్రియను షురూ చేసినట్లు తెలుస్తోంది. కొత్త దళపతిని ఈ నెలాఖరులోగా నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ ప్రాసెస్‌ను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఉంటుందని, ఆ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి నియామకం కంటే ముందే ఉంటుందని తెలుస్తోంది. టీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో పలువురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వం ఒక్కో రాష్ట్రానికి స్టేట్ చీఫ్‌ను నియమిస్తూ వస్తోంది. కాగా త్వరలోనే తెలంగాణ వంతు వచ్చే అవకాశముందనే చర్చ జోరుగా జరగుతోంది. త్వరలో ఎన్నికల జరగనున్న హర్యానా సైతం అధ్యక్షుడిని పార్టీ ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల ఆధారంగా అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్టేట్ చీఫ్‌ను త్వరగా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్, డీకే అరుణ, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు, తదితరులు పోస్ట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

సామాజిక వర్గాల ప్రకారం చూసుకుంటే మున్నురుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో మరో మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈటల రాజేందర్‌ను నియమిస్తే బాగుంటుందనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు అనే ట్యాగ్ లైన్‌తో పాటు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి ప్రియారిటీ ఇచ్చినట్లవుతుందని పార్టీ యోచిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై ఈటలకు పట్టు ఉండటంతో పాటు ఆయనకు గ్రౌండ్ లెవల్లో పరిచయాలు ఉన్నాయి. ఇది స్థానిక సంస్థలకు ప్లస్ అవుతుందని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికలకు కీలకంగా మారడంతో ఈటల అనుభవాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరో ఒకరికి ఇస్తుందా? లేదా ఎవరూ ఊహించని వ్యక్తికి అప్పగిస్తుందా? అనేది చూడాలి. నెలాఖరులోగా ఈ ఉత్కంఠకు తెరపడే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed