ఏజెన్సీలో గుస్సాడి చప్పుళ్లు షూరు.. ముస్తాబైన గిరిజన గ్రామాలు

by Aamani |   ( Updated:2024-10-25 06:37:33.0  )
ఏజెన్సీలో గుస్సాడి చప్పుళ్లు షూరు.. ముస్తాబైన గిరిజన గ్రామాలు
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసీ గుడాల్లో డప్పు చప్పుళ్లు.. తుడుం మోతలు.. గజ్జెల సవ్వళ్ళు.. మహిళల రేలా పాటలు.. యువకుల చచోయి(కోలాటాలు) నృత్యాలు.. సంప్రదాయ నృత్యాలతో ఏజెన్సీలో గిరిజన గూడాల్లో గుస్సాడి(దండారి) చప్పుళ్లు షూరు అయ్యాయి. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి(దండారి) ఉత్సవాలు ఏజెన్సీ లో గిరిజన గూడాల్లో ప్రారంభమైయ్యాయి. సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఆదివాసులు ప్రాణపదంగా భావిస్తారు. ముఖ్యంగా దండారి సంబురం గిరిజన గూడాల్లో అంబరాన్ని అంటుకుంటుంది. ఆదివాసీలకు పెద్ద పండుగ అంటే దండారి అని చెప్పవచ్చు. దీపావళికి ముందు భోగి తో ప్రారంభమయ్యే దండారి ఉత్సవాలు దీపావళి తర్వాత కోల బోడి తో ముగుస్తాయి.

గుస్సాడీలు చాలా కీలకం..

గుస్సాడి(దండారి) దీపావళి పండుగ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గిరిజన గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఏ గిరిజన గ్రామంలో చూసిన గుస్సాడి చప్పుళ్లు వినిపిస్తాయి. దండారి సమూహాలుగా చేరి సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. దండారిలో గుస్సాడీల వేషాధారణ ప్రత్యేక ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ ఒకే రకంగా దుస్తులు ధరిస్తారు. దండారి ని నిర్వహించే గ్రామాల్లో ప్రత్యేక అలంకరణలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. దండారి ఉత్సవాల సందర్భంగా గుస్సాడీలు ఎంతో నియమనిష్టలతో పండుగ ముగిసే వరకు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు సైతం చేయరు. నృత్యం చేసే వారు శరీరం నిండా బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్ల దండలు ధరిస్తారు. మెడలో రుద్రాక్షలు, అడవుల్లో దొరికే ఇతర రకాల కాయలు, గవ్వలతో దండలు మెడలో వేసుకుంటారు. కుడి చేతిలో మంత్రదండం పట్టుకుంటారు. గుస్సాడీ నృత్యం చేసే వారిని దేవతలు ఆవహిస్తారని, వారి చేతిలోని మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాదులైనా నయమవుతాయని గోండుల నమ్మకం. సంతానం లేని వారు గుస్సాడీలను ఇంటికి ఆహ్వానించి అతిథి భోజనాలు వడ్డిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. తలపై నెమలి ఈకల టోపీలు, కాళ్ళకు గజ్జెలతో వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా ప్రత్యేక నృత్యాలు చేస్తారు.

గజ్జెల సవ్వడికి నృత్యం చేయాల్సిందే..

దండారి ఉత్సవాలలో ప్రత్యేకంగా నృత్యమే.. అందరి చూపులను ఆకర్షిస్తుంది. డప్పు చప్పళ్లు.. తుడుం మోతలు.. గజ్జెల సవ్వళ్ళు.. మహిళల రేలా పాటలు.. యువకుల కోలాటలు.. సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. దండారి ఉత్సవం కోసం ఒక గూడెం నుంచి మరోక గూడెంకు బయలుదేరుతున్న సమయంలో ఆ గూడెంలోని వారంత క్షేమానికి ఉండాలని గ్రామ సమీపంలో చుక్డా గట్టి (గుడికి మూడి వేయడం) వేస్తారు. ఆ గూడెం లో ఎలాంటి కీడు జరగదని, తిరిగి వచ్చేంత వరకు మా వాళ్లను చల్లగా కాపాడాలని అంటూ వాయిద్య చప్పుళ్లతో గుస్సాడీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా ఒక్కో సంవత్సరం ఒక గూడానికి చెందిన వారు ఇంకో గూడానికి వెళ్లిన సందర్భంగా ఆ గూడానికి చెందిన ప్రజలు వారికి అతిథి మర్యాదలు స్వీకరిస్తారు.ఈ సందర్భంలో గుస్సాడీ, చచోయ్ నృత్యాలు చేస్తారు.

తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయ ఉత్సవాలకు ఒక గూడానికి చెందిన వారు మరో గూడానికి వెళ్లి సంబరాలు నిర్వహించడాన్ని దండారి. గోండులు ప్రతిష్టించిన యెత్మాసర్ పెన్(దేవతలను) ఆరాదించే క్రమంలో నిర్వహించే సంబరాలను దండారి ఉత్సవంగా నిర్వహించుకుంటామని ఆదివాసీ పెద్దలు అంటున్నారు. దీపావళికి ముందు ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలను దీపావళి తర్వాత నిర్వహించే కోల బోడి పండుగగా నిర్వహించి ముగిస్తారు. అనంతరం గుస్సాడీలు, అలంకరణ సామాగ్రికి దిష్టి తీసి వస్తు సామాగ్రిని ఒక చోటకు చేర్చి ఉయ్యాలలో పెట్టి జోల పాడుతూ గూడెం పెద్ద(పటేల్) ఇంట్లో భద్రపరచడం ద్వారా దండారి ఉత్సవాలు ముగిస్తారు.

ఘనంగా జరుపుకుంటాం : పుర్క బాపురావ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు

ఆదివాసీలు దిపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో దండారి ఉత్సవాలను ప్రతి గిరిజన గూడెం లో ఘనంగా జరుపుకుంటాం. దండారి ఉత్సవాలు నిర్వహించు రోజుల్లో గూడాల్లో ప్రజలందరి ఎంతో నిష్టతో ఉంటారు. ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. భవిష్యత్ తరాలకు మా ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు అందించడానికి పాటుపడుతాం.

Advertisement

Next Story

Most Viewed