MLC కవితకు బెయిల్.. మూడు కారణాలను కీలకంగా ప్రస్తావించిన ‘సుప్రీం’

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:36:09.0  )
MLC కవితకు బెయిల్.. మూడు కారణాలను కీలకంగా ప్రస్తావించిన ‘సుప్రీం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఒకేసారి సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తీహార్ జైలు నుంచి బైటకు వచ్చారు. ఢిల్లీలో మీడియాతో బుధవారం మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు. ఆమెకు బెయిల్ లభించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది. బెయిల్ మంజూరు చేయడానికి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మూడు ప్రధాన కారణాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు పూర్తయిందని, సీబీఐ తన ఫైనల్ ఛార్జిషీట్‌ను ట్రయల్ కోర్టులో సమర్పించిందని, మనీలాండరింగ్ చట్టంలో మహిళకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించిన బెంచ్... ఆమెను ఇకపైన జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో చెరో రూ. 10 లక్షల చొప్పును ష్యూరిటీని సమర్పించాలని, పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించాలని, అక్కడ జరిగే విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బెయిల్‌పై ఉన్న సమయంలో సాక్షుల్ని ప్రభావితం చేయరాదని, సాక్ష్యాల్ని తారుమారు చేయరాదని... ఇలాంటి షరతులను సుప్రీంకోర్టు విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని ఆమె నివాసంల ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి జ్యుడిషియల్ రిమాండ్, కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన తర్వాత కవితకు సైతం అదే తీరులో ఉపశమనం లభించడం గమనార్హం. బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు ఇటు కవిత తరపున, అటు సీబీఐ, ఈడీ తరఫున తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి.

బెయిల్ పొండానికి అర్హతలున్నాయి :

కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ వాదిస్తూ... ఆమె ఒక ప్రజా ప్రతినిధిగా (ఎమ్మెల్సీ) ఉన్నారని, మాజీ ఎంపీ కూడా అని, ఆమె ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదన్నారు. దాదాపు ఐదు నెలలకు పైగా ఆమె జైల్లో ఉన్నారని, ఢిల్లీ లిక్కర్ కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారని, ఈ కేసులో ఆమె ఏకైక మహిళా నిందితురాలిగా ఉన్నారని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు రూ. 100 కోట్లను సౌత్ గ్రూపు తరఫున కవిత ఇచ్చినట్లుగా సీబీఐ, ఈడీ ఆరోపణలు చేస్తున్నదని, కానీ ఆ డబ్బును రికవరీ చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్న అంశాలు, నిబంధనలే కవితకూ వర్తిస్తాయని వాదించారు. మనీ లాండరింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం మహిళగా కవిత బెయిల్ పొందడానికి అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు.

ఈడీ, సీబీఐ తరఫున వాటి లాయర్లతో పాటు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్సీరాజు వాదిస్తూ... ఢిల్లీ లిక్కర్ కేసుపై దర్యాప్తు జరుగుతున్న సమయంతో పాటు దానికంటే ముందే కవిత తరచూ ఫోన్లు మార్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె తన మొబైల్ ఫోన్లలో డేటాను పూర్తిగా తొలగించారని, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా వాటిని ఫార్మాట్ చేసి ఇంటి పని మనుషులకు, సన్నిహితులకు ఇచ్చారని ఆరోపించారు. సౌత్ గ్రూపు తరపున రూ. 100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూర్చారని, లెక్కల్లో లేని ఈ డబ్బుకు సంబంధించి అప్రూవర్లుగా మారినవారితో పాటు సాక్షులు వారివారి స్టేట్‌మెంట్లలో వెల్లడించారని తెలిపారు. ఇప్పుడు బెయిల్‌పై విడుదల చేస్తే మరోసారి సాక్షుల్ని, అప్రూవర్లను తారుమారు చేస్తారని అన్నారు. నిందితుల తరఫున వాదిస్తున్న లాయరే కవితకు కూడా ఉన్నందున సమాచారం పరస్పరం పంచుకునే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ఆమెకు బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరారు.

ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుని... ఎవరైనా వారి సొంత ఫోన్లలో సమాచారాన్ని తొలగించుకోవడం సహజమేనని, కవిత కూడా అలాంటి పని చేస్తే తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు. ఒక జడ్జిగా తాను సైతం సొంత ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేస్తూ ఉంటానని వ్యాఖ్యానించారు. అదనపు సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని, డాటాను తొలగించడం మాత్రమే కాక ఫోన్ మొత్తాన్ని ఫార్మాట్ చేశారని, ఇది అసాధారణమైన చర్య అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చివరకు ఇద్దరు జడ్జీలు ఏకాభిప్రాయంతో మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని కవితకు బెయిల్ మంజూరు చేశారు. మహిళగా ఆమెకున్న హక్కులను గమనంలోకి తీసుకుని ఆమెను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని, సీబీఐ తన ఫైనల్ ఛార్జిషీట్‌ను కూడా ట్రయల్ కోర్టుకు సమర్పించిందని, ఈడీ న్యాయవాదులే స్వయంగా దర్యాప్తు పూర్తయిందని పేర్కొన్నారని, వీటన్నింటి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

వాదనల సందర్భంగా కీలక వ్యాఖ్యలు

కవిత తరఫున ముకుల్ రోహతగీ వాదిస్తున్న సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నందున దేశం విడిచి పారిపోయే అవకాశమే లేదని, ఆమెపై రూ. 100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇప్పటివరకూ దర్యాప్తు సంస్థలు ఆ సొమ్మును రికవరీ చేయకపోగా ఎలాంటి ఆధారాలను సంపాదించలేకపోయిందని, ఆమె ఎవ్వరినీ బెదిరించలేదని... ఇలాంటి వాదనలు తెరమీదకు తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ఆమె నిరక్షరాస్యులేమీ కాదని, ఏది మంచో ఏది చెడో ఆమెకు తెలియదా, అప్రూవర్ ఒకసారి స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.. ఇలాంటి వ్యాఖ్యలతో ముకుల్ రోహతగీమీద అసహనం వ్యక్తం చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ వాదిస్తూ.. ఈడీ నోటీస్‌ రాగానే అన్ని ఫోన్లను కవిత ధ్వంసం చేశారని, ఇప్పుడు కూడా అదే పని చేసే అవకాశమున్నదన్నారు. ముకుల్ రోహతగీ జోక్య, చేసుకుని దర్యాప్తు సంస్థలు అడిగిన విధంగానే కవిత తను వాడిన ఫోన్లన్నింటినీ అందజేశారని, ప్రజలు ఫోన్లు, కార్లు మార్చడం సహజమేనని రిప్లై ఇచ్చారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసి... ప్రతీరోజూ ఫోన్లను మారుస్తారా అంటూ ముకుల్ రోహతగీని ప్రశ్నించిది.

Advertisement

Next Story